
వడ్డీ వ్యాపారి సోదరి ఇంటి వద్ద బాధితుల ఆందోళన
నేరేడుచర్ల : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన రమావత్ బాలాజీనాయక్ సోదరి నేరేడుచర్లలో నివాసం ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న బాధితులు బుధవారం ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన వడ్డీ వ్యాపారీ రమావత్ బాలాజీనాయక్ రూ.10 నుంచి రూ.16 వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసి తిరిగి చెల్లించలేదు. ఆ నగదుతో తన సోదరి పేరుతో నేరేడుచర్లలో ఇల్లు కొనుగోలు చేశాడని తెలుసుకున్న బాధితులు ఆమె ఇంటిపై దాడికి యత్నించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ఆస్తులను ధ్వంసం చేయడం సరైంది కాదని చెప్పి బాధితులను తిరిగి పంపించారు.