కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యం

Oct 9 2025 3:25 AM | Updated on Oct 9 2025 3:25 AM

కుమార్తెతో కలిసి  మహిళ అదృశ్యం

కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యం

మిర్యాలగూడ అర్బన్‌: ఏడాది వయస్సున్న కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యమైంది. మిర్యాలగూడ వన్‌ టౌన్‌ ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో లావూరి వెన్నెల తన భర్త వినోద్‌తో కలిసి నివాసముంటోంది. వీరికి ఏడాది వయస్సున్న పాప ఉంది. ఈ నెల 4న వినోద్‌ పని నిమిత్తం వేరే ఊరికెళ్లగా.. అదే రోజు ఉదయం 9గంటల సమయంలో వెన్నెల తన కుమార్తెతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వినోద్‌ ఎంత వెతికినా వెన్నెల ఆచూకీ లభించకపోవడంతో బుధవారం మిర్యాలగూడ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 95021 52452 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.

సాగర్‌ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు

మునగాల: అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి సాగర్‌ ఎడమ కాలువలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యాడు. ఈ ఘటన మునగాల మండలం కృష్ణానగర్‌ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్‌ గ్రామానికి చెందిన బుక్యా బాబునాయిక్‌(42) బుధవారం అయ్యప్ప మాల స్వీకరించాడు. సాయంత్రం స్నానం చేసేందుకు గ్రామ శివారులోని సాగర్‌ ఎడమ కాలువకు మరికొందరు అయ్యప్ప మాలధారులతో కలసి వెళ్లాడు. స్నానం చేసే క్రమంలో బాబునాయిక్‌ ప్రమాదవశాత్తు జారి ఎడమ కాలువలో మునిగిపోయాడు. అతడికి ఈత వచ్చినప్పటికీ వరద తాకిడికి కొట్టుకుపోయాడు. బాబునాయిక్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయ్యప్ప మాలధారులు, బాబునాయిక్‌ కుటుంబ సభ్యులు నడిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరణ

మఠంపల్లి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ ఘటన మఠంపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రంలో నివాసముంటున్న ఆదూరి మర్రెడ్డి అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో వెళ్లాడు. మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతడి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. చోరీ జరిగిన విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న మర్రెడ్డి బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. బాబు తెలిపారు.

యాదగిరి క్షేత్రంలో

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement