
ఆఫ్రికా నత్తల నివారణ ఇలా..
గుర్రంపోడు : గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో ఉద్యానవన అధికారుల, శాస్త్రవేత్తల బృందం బుధవారం ఉద్యానవన పంటలను పరిశీలించి తోటలకు హాని కల్గిస్తున్న నత్తలను ఆఫ్రికా నత్తలుగా గుర్తించారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి కె.సుబాషిణి, మల్లేపల్లి ఉద్యాన పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్త రాజాగౌడ్, ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి కె.మురళితో కూడిన బృందం ఆఫ్రికా నత్తల ప్రభావాన్ని పరిశీలించి తగు నివారణ చర్యలను సూచించింది. ఆఫ్రికా నత్తలు వందేళ్ల క్రితమే భారతదేశానికి వలస వచ్చాయని, మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నాయని అన్నారు. కేరళ, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుంచి శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను దిగుమతి చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి ఆఫ్రికా నత్తలు వచ్చాయని గమనించామని తెలిపారు. ఆఫ్రికా నత్తలు జులై నుంచి ఫిభ్రవరి వరకు గుడ్లను ఒక్కో నత్త 400 గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయని అన్నారు. ఒక్కో ఆప్రికా నత్త తమ జీవితకాలమైన ఐదేళ్లలో 1200 వరకు పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు. బొప్పాయి, అరటి, జామ, ఆయిల్ ఫామ్ తదితర పండ్లతోటలతోపాటు కూరగాయల పంటలను నాశనం చేస్తాయన్నారు.
నివారణ చర్యలు చేపట్టాలి
ఆఫ్రికా నత్తల నివారణకు ఒక కిలో ఉప్పును నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయని తెలిపారు. ఆకర్షణ ఎర ఏర్పాటులో భాగంగా 10 కిలోల వరి తవుడుకు, ఒక కిలో బెల్లం , ఒక లీటరు ఆముదం మరియు ఒక కిలో ధయోడికార్స్ గుళికలు లేదా ఎసిఫేట్ లేదా క్లోరోఫైరిఫాస్ కలిపి చిన్న ఉండలుగా చేసి ఈ ఉండలను బొప్పాయి, క్యాబేజీ ఆకుల కింద ఉంచితే ఆఫ్రికా నత్తలు తిని చనిపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అనంతరం వీటిని ఉప్పు ద్రావణంలో వేయాలని, వారానికి రెండు, మూడు రోజుల పాటు 15 రోజుల వరకు ఇలా చేయాలని సూచించారు. నత్తలు ఏరివేసే సమయంలో చేతికి గ్లౌజులు తప్పనిసరి ధరించాలన్నారు. 2 గ్రాముల కాపర్ సల్పేట్, 2 గ్రాముల పెర్రస్ సల్పేట్ ఒక లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేస్తే 70 శాతం నత్తలు కింత పడిపోతాయని, వీటిని ఏరి కాల్చి వేయలన్నారు. 2 గ్రాముల మెటల్డిహైడ్ 2.5 గుళికలు భూమి పైన మరియు చెట్ల మొదళ్లలో ఎరగా చల్లాలని అన్నారు. పండ్లతోటల్లో కలుపు, చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని , మొక్కలను ఒత్తుగా దగ్గరగా వేసుకోకూడదని, రాత్రిళ్లు నీరు పారించవద్దని చెప్పారు. తోటల్లో కోళ్లు, బాతులు పెంచుకోవాలని సూచించారు.
బీరకాయను తినేస్తున్న ఆరఫ్రికా నత్త
పిట్టలగూడెంలో ఆఫ్రికా నత్తలను పరిశీలిస్తున్న
ఉద్యానవన అధికారి, శాస్త్రవేత్తల బృందం
ఫ ఉద్యానవన అధికారులు, శాస్త్రవేత్తల సూచన

ఆఫ్రికా నత్తల నివారణ ఇలా..