
ఉత్సవాలకు సిద్ధం
నేడు దసరా, శమీ పూజకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: తొమ్మిది రోజుల పాటు దేవీశరన్నవరాత్రులు నిర్వహించి పదో రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ పండుగ శోభ సంతరించుకున్నాయి. విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకరణలో పూజించనున్నారు.
నేడు ఆయుధ పూజ..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు (గురువారం) ఆయుధపూజ నిర్వహించుకోనున్నారు. రైతులు వ్యవసాయ పనిముట్లు, వాహనదారులు తమ వాహనాలకు, పోలీసులు ఆయుధాలకు ఇలా ఎవరికివారు తమ వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలకు పూజలు చేయనున్నారు.
శమీ పూజ..
విజయదశమి రోజు శమీ దర్శనం కోసం జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. అగ్నిని శమింపజేయడానికి ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం. అటువంటి శమీ వృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకును తీసుకువచ్చి పెద్ద వారికి ఇచ్చి వారికి చేసి ఆశీర్వాదం పాదాభినందనం తీసుకుంటారు.
పాల పిట్ట దర్శనం ప్రత్యేకం
దసరా పండుగ రోజు సాయంత్రం పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం ఉన్నది. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాల పిట్టను చూస్తే పాపాలు, కర్రె పిట్టను చూస్తే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూస్తే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. ఇందుకోసం శమీపూజ అనంతరం కిలో మీటర్ల దూరం అటవీ ప్రాంతంలోకి పోయి పాలపిట్టను దర్శించుకుంటారు.
అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు
జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ, సింగరేణి, దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సుమారు 40 ఫీట్ల పొడవైన రావణాసుర బొమ్మను ఏర్పాటు చేశారు. నేడు సాయంత్రం ప్రముఖ గాయకులు, మిమిక్రీ ఆర్టిస్టులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ముఖ్య అతిఽథులుగా కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్‌ఖరే, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి అధికారులు పరిశీలించారు.
కేటీకే 5వ గనిలో జమ్మి పూజలు
విజయదశమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని ఆవరణలోని దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడే ఉన్నటువంటి జమ్మి చెట్టుకు పూజలు చేసి చెట్టు ఆకును పంచిపెడుతారు. పట్టణంలో ప్రజలందరూ ఇక్కడికి చేరుకొని జమ్మి ఆకులను పంచుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటారు.
సందడిగా మారిన పల్లె, పట్నం
జిల్లా వ్యాప్తంగా రావణాసుర
దహన కార్యక్రమాలు
జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు

ఉత్సవాలకు సిద్ధం

ఉత్సవాలకు సిద్ధం