స్థానిక పోరుపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

స్థానిక పోరుపై ఫోకస్‌

Oct 7 2025 4:15 AM | Updated on Oct 7 2025 4:15 AM

స్థాన

స్థానిక పోరుపై ఫోకస్‌

స్థానిక పోరుపై ఫోకస్‌

గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల వేట

భూపాలపల్లి: బీసీ రిజర్వేషన్ల ముచ్చట ఎలా ఉన్నా గ్రామాల్లో మాత్రం రాజకీయ వేడి రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఓ వైపు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే చర్చ సాగుతున్న తరుణంలోనే మరోవైపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటూనే, ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నాయి.

అభ్యర్థుల కోసం పరిశీలన..

జిల్లాలో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ, 248 సర్పంచ్‌, 2,102 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కోసం ఆశావాహులంతా వేచి చూస్తున్నారు. కోర్టు తీర్పు రాకముందే జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నాయి. పార్టీల నేతలు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ ఇతర పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టికెట్‌ ఆశిస్తున్న వారి పేర్లను ప్రధాన పార్టీలు ఇప్పటికే సేకరించాయి. ఒక్కో స్థానానికి సుమారు పది మంది టికెట్‌ ఆశిస్తుండగా నలుగురు, ఐదుగురు పేర్లను ఫైనల్‌ చేసి మళ్లీ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరికి టికెట్‌ ఇస్తే గెలిచే అవకాశం ఉందని గ్రామస్తుల అభిప్రాయాలు అంతర్గతంగా తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలకు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

వేడెక్కిన రాజకీయం..

గ్రామాల్లో స్థానిక ఎన్నికల వేడి నెలకొంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు వివిధ కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇరు పార్టీల నాయకులు నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’ పేరిట కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ‘బీఆర్‌ఎస్‌ డోకా కార్డు’ను విడుదల చేశారు. దీంతో ‘స్థానిక’ రాజకీయం మరింత వేడెక్కింది.

ఆ ఐదు మండలాలపైనే దృష్టి..

జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జెడ్పీ చైర్మన్‌ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించినందున ఆ రిజర్వేషన్‌ ఉన్న ఐదు మండలాలపైనే దృష్టి సారించాయి. జిల్లాలోని గణపురం, కొత్తపల్లి గోరి మండలాల జెడ్పీటీసీ స్థానాలు బీసీ మహిళ, చిట్యాల, భూపాలపల్లి, మహదేవపూర్‌ బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో ఆయా మండలాల్లో దీటైన, గెలుపొందే అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నాయి.

ఇద్దరు, ముగ్గురు మద్దతిస్తే అక్కడ ఎంపీపీ..

జిల్లాలోని 109 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 12 మండలాలకు ఎంపీపీలు ఉండనున్నారు. 9 మండలాల్లో 8, 9కి పైగా ఎంపీటీసీ స్థానాలు ఉండగా మూడు మండలాల్లో మాత్రం అతి తక్కువ స్థానాలు ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లో ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీలు మద్దతిస్తే ఎంపీపీ స్థానాన్ని చేజిక్కించుకోవచ్చు. కొత్తపల్లి గోరి, మల్హర్‌ మండలాల్లో ఆరు చొప్పున స్థానాలు ఉండగా ముగ్గురి మద్దతు, పలిమెల మండలంలో కేవలం ఇద్దరు గెలుపొందిన ఎంపీటీసీలు మద్దతిస్తే ఎంపీపీ కుర్చీని కై వసం చేసుకోవచ్చు. దీంతో ఇక్కడి పీఠాలను దక్కించుకునేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అన్వేషిస్తున్నాయి.

జెడ్పీ పీఠం కోసం

ఆ మండలాలపై దృష్టి

గ్రామాల్లో నెలకొన్న రాజకీయ వేడి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య

‘కార్డు’ పంచాయితీ

స్థానిక పోరుపై ఫోకస్‌1
1/1

స్థానిక పోరుపై ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement