
విద్యాశాఖలో నూతన విధానం
● అకడమిక్ క్యాలెండర్ల పంపిణీకి శ్రీకారం
● జీఓ జారీచేసిన పాఠశాల విద్యాశాఖ
● స్కూళ్లు, ఆఫీసుల్లో ప్రదర్శనకు చర్యలు
● కార్యక్రమాల అమలులో పారదర్శకత..
భూపాలపల్లి అర్బన్: జిల్లాల్లోని పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీకి పాఠశాల విద్యాశాఖ నూతన శ్రీకారం చుట్టింది. విద్యాసంవత్సరానికి అనుగుణంగా రూపొందించిన ఈ క్యాలెండర్ ద్వారా బోధన, పరీక్షలు, సెలవులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వార్షిక కార్యక్రమాల షెడ్యూల్ పొందుపర్చింది. విద్యాశాఖ ప్రతీ సంవత్సరం విధివిధానాల ప్రకారం క్యాలెండర్ విడుదల చేస్తూ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కలెక్టరేట్, డీఈఓ తదితర కార్యాలయాలు, ఆయా పాఠశాలల్లో క్యాలెండర్లను ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ గత నెల 27న ఆదేశాలు జారీచేశారు.
కార్యక్రమాల పటిష్ట అమలుకు..
ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో అకడమిక్ క్యాలెండర్ పేరిట మార్గ సూచిని విడుదల చేస్తున్నా పాఠశాలల్లో దీనిని అమలు చేయడంలో మాత్రం లోపాలు తలెత్తుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు మినహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యాశాఖ విడుదల చేస్తున్న అకడమిక్ క్యాలెండర్ నిర్వహణపై సరైన అవగాహన ఉండడం లేదని భావించింది. దీంతో అకడమిక్ క్యాలెండర్‌ను పోస్టర్ రూపంలో అన్ని పాఠశాలల్లో ప్రదర్శించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
క్యాలెండర్‌లో ఉండే సమాచారం
జిల్లాలో 414 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 22వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటన్నింటిలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అకడమిక్ క్యాలెండర్లను పంపిణీ చేసి ప్రదర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏ నెలలో ఏయే పరీక్షలు నిర్వహించాలి. సిలబస్ పూర్తిచేసే సమయం, పాఠశాల సముదాయ సమావేశాలు, ప్రదర్శన పోటీలు, క్రీడలు, గ్రంథాలయాల నిర్వహణ తదితర వివరాలు అన్నీ ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ప్రధాన కార్యకలాపాలను అంశాల వారీగా రూపొందించి ఉండడంతో తదనుగుణంగా అకడమిక్ క్యాలెండర్‌ను ప్రయోజనాత్మకంగా అమలుచేసే ఆస్కారం ఉంటుంది. పారదర్శకత లోపించకుండా ఉంటుంది.
విద్యా విషయక ప్రయోజనాలెన్నో..
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ ద్వారా విద్యాపరమైన ప్రయోజనాలు పూర్తిస్థాయి ప్రయోజనకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. క్యాలెండర్ల ప్రదర్శన ద్వారా విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి కొనసాగే బడిబాట నిర్వహణ తేదీలు మొదలుకొని సెలవు దినాలు, నెల వారీ పరీక్షలు, పూర్తి చేయాల్సిన సిలబస్, ప్రాధాన్యత కలిగిన దినోత్సవాలు, తల్లిదండ్రుల సమావేశాలు, వివిధ రకాల పండుగ సెలవులు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ఇవన్నీ నెలవారీగా అమలు చేయడం, తద్వారా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా సరళతరం అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తంజేస్తున్నారు.
పకడ్బందీ అమలుకు అవకాశం..
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ నిర్ణయం సముచితమైంది. ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరుతుంది. ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్లను ఆయా పాఠశాలల్లో ప్రదర్శించడం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుంది. ఉపాధ్యాయులు నెలవారీగా నిర్వహించే కార్యక్రమాల గురించి అవగాహన కలుగుతుంది.
– పెండెం మధుసూదన్,
టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రాథమిక పాఠశాలలు 301
ప్రాథమికోన్నత పాఠశాలలు 44
ఉన్నత పాఠశాలలు 69
మొత్తం విద్యార్థులు 22,723

విద్యాశాఖలో నూతన విధానం