
ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరసగా రెండో రోజు కొనసాగింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్‌లతో ఏడీబీ– వాటర్– అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో(సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ(డైరెక్టర్), సంజయ్ జోషి(ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్(సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) సమావేశమయ్యారు. అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పురపాలక– పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు– వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఐఏఎస్‌లను కలిశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐఏఎస్‌ను ఆయన చాంబర్‌లో ఏడీబీ బృందం కలిసినట్లు సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులలో పురోగతి, ఏడీబీ అందజేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు.