
ఆధునిక హంగులతో జిగేల్
‘కార్పొరేట్’ను తలపిస్తున్న తహసీల్దార్ కార్యాలయం 1887 నాటి భవనం సుందరీకరణ అధికారులతో పాటు సందర్శకులకు వసతులు
చాలా సంతోషంగా ఉంది
తెనాలి: పట్టణంలోని కొత్తపేటలో గల పురాతన తహసీల్దార్ కార్యాలయం ఆధునిక హంగులతో జిగేల్ మంటోంది. అపరిశుభ్ర పరిసరాలు,వాహనాల పార్కింగ్‌తో చిందరవందరగా ఉండే కార్యాలయం నేడు కార్పొరేట్ తరహాలో సుందరీకరణకు నోచుకుంది. పనుల మీద వచ్చే ప్రజలకూ తగిన వసతులు కల్పించారు. పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. అక్కడ అడుగుపెట్టినవారు ఇది ప్రభుత్వ కార్యాలయమేనా! అన్నంత అందంగా అధికారులు తీర్చిదిద్దారు.
1887లో నిర్మాణం
తెనాలి తహసీల్దార్ కార్యాలయం 1887లో బ్రిటిష్ పాలకుల హయాంలో 3.87 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. కాలక్రమంలో ఆ స్థలంలోనే కోర్టు, పోలీస్‌స్టేషన్, సబ్ ట్రెజరీ, సబ్ జైలు, ఎకై ్సజ్ స్టేషన్, ఫైర్‌స్టేషన్, ఎన్జీవో హోమ్, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాలు వచ్చేశాయి. పరిసరాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆవరణలోనే వాహనాల పార్కింగ్, పందుల సంచారం, ఏపుగా పెరిగిన చెట్ల పక్కన సందర్శకుల మూత్ర విసర్జన, కార్యాలయం వెనుక వైపు రాత్రిళ్లు మందుబాబులు తాగి పడేసిన బాటిళ్లతో దారుణంగా ఉండేది.
తహసీల్దార్ చొరవతో ముందుకొచ్చిన దాతలు
మండల తహసీల్దార్‌గా కేవీ గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టాక వీటిన్నిటినీ పరిశీలించారు. కార్యాలయ పరిసరాలతో పాటు భవనాన్ని కూడా సుందరీకరించాలని కంకణం కట్టుకున్నారు. మంచి పనికి మేమున్నామంటూ దాతలూ ముందుకొచ్చారు. ముందుగా పరిసరాలను శుభ్రం చేయించారు. ట్రాక్టరు లోడు ఖాళీ మద్యం సీసాలు తీయించారు. కార్యాలయానికి ఇరువైపులా ప్రహరీ వచ్చేసింది. ఆవరణలో శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల పెంకుల భవనాన్ని ముందుగా ఆధునికీరించారు. సందర్శకుల కోసం మరో హాలును నిర్మించారు. అక్కడే విధులను నిర్వర్తిస్తూ భవనం సుందరీకరణకు పూనుకున్నారు. ఆవరణలో ఫ్లోరింగ్‌తో పాటు చక్కని పార్కును తీర్చిదిద్దారు. మధ్యలో నాలుగు సింహాల స్తూపంతో పాటు ఓ పక్కన వర్షపాతం నమోదు సూచికను ఏర్పాటుచేయించారు.
కేరళ నుంచి పెంకులు
ప్రధాన భవనానికి అదే తరహా పెంకులను కేరళ నుంచి తెప్పించారు. అడుగు మందంలో ఫ్లోరింగ్ పెంచటంతో ముందు భాగంలో ఎత్తు తగ్గిన పైకప్పును జాకీలతో నాలుగు అంగుళాలు ఎత్తు పెంచారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా క్యూబిక్ రూమ్స్, కంప్యూటర్ రూమ్, యాంటీ రూమ్, సందర్శకుల వెయిటింగ్ హాలు, ప్రత్యేకంగా టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయించారు. అటు ఉద్యోగులు, ఇటు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకూ మంచి వాతావరణం కల్పించారు. వెనుకనున్న గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘ భవనాన్నీ కూడా సుందరీకరణ చేస్తున్నారు.
నేను ఎక్కడ ఉద్యోగం చేసినా కార్యాలయం బాగుండేలా చూస్తా. తెనాలి వచ్చాక
ఇక్కడ కార్యాలయం పరిస్థితి బాధేసింది. ఎలా బాగు చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. ఈ సమయంలో నాకు ప్రధాన దాత సూర్యదేవర భువనకుమార్, మరికొందరు సహకరించారు. అనుకున్నట్టుగా సుందరీకరణ చేయగలిగాం. మరికొద్దిరోజుల్లో పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. చాలా సంతోషంగా ఉంది.
– కేవీ గోపాలకృష్ణ, తెనాలి తహసీల్దార్

ఆధునిక హంగులతో జిగేల్

ఆధునిక హంగులతో జిగేల్