
ఏఎన్‌యూ వీసీగా సత్యనారాయణ రాజు
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఆచార్య సామంతపూడి వెంకట సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ నజీర్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య సత్యనారాయణరాజు ఇప్పటి వరకూ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటోమాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఏఎన్‌యూలో గత కొంతకాలంగా ఇన్‌చార్జి వీసీగా ఆచార్య కె. గంగాధరరావు విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణరాజు అగ్రికల్చర్ బీఎస్సీని మహారాష్ట్రలోని డాక్టర్ పుంజాబ్‌రావు క్రిషి విద్యాపీఠ్ నుంచి 1983లో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును హిమాచల్‌ప్రదేశ్‌లోని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ పారెస్ట్రీ నుంచి 1986 లోనూ, అగ్రికల్చర్ ఎంటోమాలజీలో పీహెచ్‌డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1990లో పొందారు. బోధన రంగంలో 28, పరిశోధనా రంగంలో 32 సంవత్సరాల అనుభవం గడించారు. రైతులు అనుబంధ అంశాల్లో 28 సంవత్సరాలకు పైగా పాలు పంచుకున్నారు.
పలు కమిటీల్లో సభ్యత్వం
యునైటెడ్ కింగ్‌డమ్ దేశానికి చెందిన వరల్డ్ బీ ప్రాజెక్ట్ ఎడ్వజరీ బోర్డుకు, నాగాలాండ్ సెంట్రల్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీకి, బెనారస్ హిందూ యూనివర్సిటీలోని పలు కమిటీలు, పలు జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల బోర్డుల్లోనూ సభ్యుడిగా సత్యనారాయణరాజు వ్యవహరించారు. 2017లో అలహాబాద్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎన్విరాల్‌మెంటల్ కాన్వర్జేషన్ అవార్డును, అదే ఏడాది వారణాసిలోని మహిమా రీచెర్చ్ ఫౌండేషన్ అండ్ సోషల్ వెల్‌ఫేర్ నుంచి లైఫ్‌టైమ్ ఎచ్చీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్‌సీసీ నుండి బెస్ట్ ఏఎన్‌ఓ అవార్డును అందుకున్నారు. 2018లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రో ఎన్విరాల్‌మెంట్ సొసైటీ నుంచి ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డును, ఒరిస్సా రాష్ట్రంలోని అఫ్‌లైడ్ జువాలజిస్ట్ అండ్ రీసెర్చ్ సంస్థ నుండి డాక్టర్ ఆనంద్ ప్రకాష్ అవార్డును, 2019లో అలహాబాద్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చరిక్ ఎచీవ్‌మెంట్ అవార్డును పొందారు. ప్రస్తుతం ఎంటోమాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫెలోగా కొనసాగుతున్నారు. ఈయన పర్యవేక్షణలో ఇప్పటి వరకూ తొమ్మిది మందికి పీహెచ్‌డీలు, 34 మందికి పీజీ సంబంధిత డిగ్రీలు చేశారు. అమెరికా చైనాతో పాటు పలు దేశాలను సందర్శించి, పలు అంశాలపై పరిశోధనా పత్రాలు సమర్పించడంతో పాటు ప్రసంగాలు చేశారు. ఏఎన్‌యూలో ప్రస్తుతం ఏడాదిన్నరగా తాత్కాలిక వీసీగా విధులు నిర్వహిస్తున్న ఆచార్య కె. గంగాధరరావును తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రార్ తగిన ఏర్పాట్లు చేయాలని జీవోలో పేర్కొన్నారు. నూతన వీసీగా ఆచార్య ఎస్ వెంకటసత్యనారాయణరాజు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.