
చంద్రవంక వరద ఉధృతి తగ్గుముఖం
మాచర్ల: చంద్రవంక వాగు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు ఉధృతంగా ప్రవహించడంతో మాచర్ల నుంచి జమ్మలమడక, తుమృకోట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం వరద తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగాయి.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక నగరంపాలెం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణచక్రవర్తిని బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల మొక్కను అందించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం న్యాయశాఖ, పోలీస్ శాఖ నిర్వహించాల్సిన పలు అంశాలపై చర్చించారు. జిల్లా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించడం, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టేందుకు అవసరమైన పరిపాలనా, చట్టపరమైన చర్యలపై చర్చించారు. జిల్లా ప్రజలకు సమర్థ, నిష్పాక్షిక సేవలు అందించాలని నిర్ణయించారు.
మంగళగిరి టౌన్ : మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని యూపీ స్కూల్‌లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 11వ ఉచిత మహిళా యోగా శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ యోగా ముగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగా సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యధాశక్తి యోగి గురూజీ హాజరయ్యారు. మహిళా యోగా సాధకులు పలు యోగాసనాలు ప్రదర్శించారు. పలువురు యోగా సాధకులు మాట్లాడుతూ యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక రుగ్మతలు కూడా తొలగుతాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు యోగా సాధనలో శిక్షణ ఇప్పించడానికి ఆసక్తి కనబర్చాలన్నారు. మహిళలు యోగా శిక్షణకు వెళితే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో యోగ సేవ కేంద్ర ప్రతినిధి కీర్తియోగి మాతాజీ, యోగా సాధకులు పద్మలత, సుజాత, పద్మ పాల్గొన్నారు.
ఏఎన్‌యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం నుంచి బి.ఫార్మసీ రెండవ సెమిస్టర్ (రెగ్యులర్), ప్రథమ సెమిస్టర్ (సప్లిమెంటరీ)పరీక్షలతో పాటు ఫార్మా.డి పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. బి.ఫార్మసీ పరీక్షలు 18 కేంద్రాల్లోను, ఫార్మా.డి పరీక్షలు 10 కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు నరసరావుపేటలోని ఇండో అమెరికన్ ఫార్మసీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు.
పొన్నూరు: దళిత, ఆదివాసీ హక్కుల సాధన కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాలగోపాల్ అని వక్తలు కొనియాడారు. పొన్నూరులోని మానవహక్కుల వేదిక కార్యాలయంలో బుధవారం బాల గోపాల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టి.రాజారావు, న్యాయవాదులు జి.ఎస్. రాయల్, తోడేటి శ్రీనివాస్, బలగని వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, చుక్కా వెంకటేశ్వర్లు, గేరా మున్ని పాల్గొన్నారు.

చంద్రవంక వరద ఉధృతి తగ్గుముఖం

చంద్రవంక వరద ఉధృతి తగ్గుముఖం

చంద్రవంక వరద ఉధృతి తగ్గుముఖం