
మెడి‘కిల్’ను ఉపసంహరించుకోవాలి
కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రతిపాదించి, నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసే 300 పడకల ఆసుపత్రితో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూరుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం నెపంతో 10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సహేతుకం కాదని ఖండించారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్తే ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని తెలిపారు. వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటే పేద, మధ్యతరగతి ప్రజలకు జరిగే మేలు గురించి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.
ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు అదనంగా పేద ప్రజలు సేవలు పొందుతారని పేర్కొన్నారు. జీవో నంబర్ 107, 108లపై నాడు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం తగదని హితవు పలికారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఏఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గత 37 ఏళ్లుగా విద్య, వైద్య రంగాలపై జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి గోరంట్ల వెంకటరావు, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయరెడ్డి, ఆవాజ్ నేత చిస్టీ, కౌలు రైతుల సంఘం నాయకులు అజయ్ కుమార్, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నేతలు కుమార్, శ్రీనివాస్, సలీం పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు
గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య కళాశాలలను పబ్లిక్, పైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఉపసంహరించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్య వ్యవస్థ కొనసాగాలని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.