
గంజాయి కేసులో నిందితుడికి జైలు, జరిమానా
తెనాలిరూరల్: గంజాయి కేసులో నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎ.పవన్‌కుమార్ తీర్పు నిచ్చారు. రూరల్ ఎస్‌ఐ ఆనంద్ అందించిన వివరాలు... పట్టణ ముత్తెంశెట్టిపాలేనికి చెందిన గంటినపల్లి పూర్ణచందు, సీబీఎన్ కాలనీకి చెందిన మొగిలి సాయి, గండికోట గోపి బైక్‌పై వస్తూ 2021 అక్టోబర్ 16న పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా పెదరావూరు జంక్షన్ వద్ద 500 గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు. వీరిలో గోపి పరార్ కాగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కొద్ది రోజులకు గోపిని అప్పటి సీఐ ఎం. సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ జి.ఏడుకొండలు అరెస్ట్ చేశారు. ఈ కేసు మంగళవారం విచారించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) ఎ.పవన్‌కుమార్, ముద్దాయిలు పూర్ణచందు, మొగిలి సాయిలకు మూడు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మూడో నిందితుడు గోపిపై కేసు కొట్టివేశారు. ప్రసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్‌కుమార్ వాదించారు.
జాతీయ అథ్లెట్ రష్మిశెట్టికి ఘన సన్మానం
లక్ష్మీపురం: జాతీయ అథ్లెటిక్స్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌కి చెందిన టీటీఐ(రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్) రష్మిశెట్టి కాంస్య పతకం సాధించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రష్మిశెట్టి 64వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ ప్రధానంగా జాతీయ క్రీడా పోటీలలో గుంటూరు రైల్వే డివిజన్ తరుఫున జావెలిన్ త్రోలో పాల్గొని సత్తా చాటిన రష్మి శెట్టిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గుంటూరు రైల్వే డివిజన్ తరుపున క్రీడా, సాంస్కృతిక పోటీలలో ఆసక్తి కనబరిచిన వారికి ఎల్లప్పుడు తమ సహయా సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ముగిసిన రాష్ట్రస్థాయి ఎడ్లపోటీలు
క్రోసూరు: మండలంలోని బయ్యవరం గ్రామంలో పోలేరమ్మతల్లి, లక్ష్మీతిరుపతమ్మతల్లి గోపయ్యస్వామి ఆశీస్సులతో గత ఐదు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎడ్లపోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. విజేతల వివరాలు సీనియర్ విభాగంలో.. ప్రథమ బహుమతి హీరోహోండా డీలక్స్ బైక్‌ను ఏఎస్‌పీ సుంకి సురేంద్రరెడ్డి, సుంకి సాకేతరెడ్డి, సారికారెడ్డిల ఎడ్ల జత (హుజుర్‌నగర్, తెలంగాణ) గెలుచుకుంది. అదేవిధంగా ద్వితీయ బహుమతి రూ.60వేలు పావులూరి వీరస్వామి చౌదరి ఎడ్లజత (బాపట్ల జిల్లా, బల్లికురవ) గెలుచుకుంది. బాపట్ల జిల్లా, వేటపాలెం, అత్తోటశిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరిల ఎడ్ల జత రూ.40 వేలు, కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన గరికపాటి శ్రీధర్‌కు చెందిన ఎడ్లు రూ.30వేలు, ప్రకాశంజిల్లా బేస్తవారిపేట, జేసీ అగ్రహారం, లక్కు నాగశివశంకర్‌కు చెందిన ఎడ్ల జత రూ.20 వేలు, తెలంగాణ రాష్ట్రం, మఠం పల్లి, గాయం శృజన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డిల ఎడ్ల జత రూ.15వేలు, గుంటూరు జిల్లా, కాకుమాను మండలం, కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షితా చౌదరిల ఎడ్ల జత రూ.12వేలు, కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన అక్కినేని ముకుళ సత్యచౌదరి ఎడ్ల జత రూ.10 వేలు గెలుచుకున్నాయి.

గంజాయి కేసులో నిందితుడికి జైలు, జరిమానా