యడ్లపాడు: అనుమానస్పదంగా ఓ యువకుడు ఆనవాళ్లు గుర్తుపట్టని విధంగా మృతి చెంది రోడ్డు పక్కన పడి ఉన్న ఘటన మండలంలో కలకలం రేగింది. మండలంలోని బోయపాలెం – సంగంగోపాలపురం గ్రామాల మధ్య మార్గంలో మంగళవారం ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసులు మొదట హత్యగా అనుమానించిన పోలీసులు ఘటనా స్థలి పరిశీలిన అనంతరం రోడ్డు ప్రమాదంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మండలంలోని బోయపాలెం నుంచి చెంఘీజ్‌ఖాన్‌పేట వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఓ యువకుడు ముఖం ఛిద్రమై మృత్యువాత పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న యడ్లపాడు పోలీసులు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం దారుణంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందునే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని, తల పూర్తిగా నుజ్జునుజ్జుయి, ఆనవాళ్లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. మృతుడికి సుమారు 30 – 35 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
తెల్లని మేనిఛాయ కలిగి ఉన్నాడు. పసుపు రంగు టీషర్టు, నీలం రంగు షార్టు ధరించి ఉన్నాడు. ముఖ్యంగా, అతని ఎడమ కాలికి నల్లదారం కట్టి ఉండటాన్ని గుర్తించారు. బహుశా ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు మండలం పరిధిలోని అన్నివలస కూలీలు పనిచేసే నూలుమిల్లు, క్వారీలు, కంపెనీల్లో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవాగారంలో భద్రపరిచినట్లు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలిసినవారు యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌న్‌లో సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.