ఏఎన్‌యూ(పెదకాకాని): ఏపీ పీజీ సెట్ ప్రవేశాల్లో భాగంగా వర్సన్ విత్ డిజేబిలిటీస్ (పీడబ్ల్యూడి) కేటగిరిలో అడ్మిషన్లకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ కో ఆర్డినేటర్ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఉదయం 10 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రాలో సినిమాలు తీయవద్దు
నిర్మాతలకు ‘మా– ఏపీ’ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా వినతి
తెనాలి: ఆంధ్రాలో సినిమాలు చిత్రీకరించవద్దని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్(మా–ఏపీ) వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రాలో తీసే సినిమాకు రూ.10 లక్షలు సబ్సిడీ చెల్లిస్తామని జీవో చేసినా ఒక్క సినిమాకు కూడా సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించారు.
అతితక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్న ‘భోజ్ పురి’ సినిమాలకు సైతం సబ్సిడీ వెంటనే చెల్లిస్తున్నారని చెప్పారు. పదేళ్లుగా సినిమాలకు సబ్సిడీ చెల్లించని రాష్ట్రాలున్నాయా? అని ప్రశ్నించారు. ఆంధ్రాలో సినీపరిశ్రమ అభివృద్ధి గురించి ఒంటరిపోరాటం మినహా ఆశించిన స్పందన ప్రభుత్వం నుంచి రావటం లేదన్నారు. పరిశ్రమ గురించి పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఒక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి విధివిధానాలను ప్రకటించేదని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
చిలకలూరిపేట: చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం అండర్–19 బాలురు, బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్‌ఎం కృపాదానం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్యలు ప్రారంభించిన ఈ క్రీడా పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్‌ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావు పర్యవేక్షించారు.
ఎంపికై న బాలురు జట్టు: నాగశరత్, అస్రామ్, ఎండి అబ్దుల్ సమీర్, కె.జయరామ్, యశ్వంత్, యు హేమంత్రెడ్డి, జె అంకమ్మరావు, త్రినాథ్, ఎస్ వెంకటరాజేష్, ఎల్.లాకేష్, సీహెచ్ అక్ష, కె.వంశీకృష్ణ.
బాలికల జట్టు: ఇ.ప్రశాంతి, శ్రీ చందన, జి.అనిత, జి.మనీష, నేత్ర, పి.పావని, పి.హారిక, బి.శ్రీవల్లి, బి.రష్మి, కె.శ్రావ్య, జి.గౌతమి, పి.జ్యోతి చంద్రిక, పి.అమృతవర్షిణి. ఎంపికై న క్రీడాకారులను ఎస్‌ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావులతో పాటు పీఈటీలు, ఇతర పెద్దలు అభినందించారు.