
రాష్ట్రంలో కులగణన చేపట్టాలి
లక్ష్మీపురం: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఏ తరహాలో కులగణన చేశారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేసేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాయలంలోని మల్లయ్య లింగం భవన్‌లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనగణనలో కులగణన తక్షణమే చేపట్టాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరుతూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనగణనలో కులగణన చేయడమే కాకుండా త్వరలో జరుగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కులగణన చేపట్టాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులగణన జరిగితే బీసీలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు కులగణన కోసం క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీసీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సీపీఐ నాయకులు జంగాల అజయ్‌కుమార్, ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల పరప్రసాద్, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఖాజావలి ప్రసంగించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ