
మిర్చి సీజన్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): రాబోయే మిర్చి సీజన్ నాటికి మిర్చి యార్డు లోపల, బయట రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు కోరారు. మిర్చి సీజన్ ఏర్పాట్లపై మార్కెటింగ్ శాఖ అధికారులు, మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, సూపర్ వైజర్లు, వేమెన్స్‌లతో మంగళవారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. తొలుత పలువురు ఎగుమతిదారులు మాట్లాడుతూ మిర్చి సీజన్‌లో సుమారు లక్ష మంది, అన్ సీజన్‌లో 50 వేల మంది యార్డుపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సీజన్‌లో యార్డులోని అన్ని గేట్లు తెరిచేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన మిర్చిని తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు సమస్య ఉందని, యార్డుకు ఇరువైపులా రోడ్లు విస్తరించాలని సూచించారు. లారీల యూనియన్ సమస్య అధికంగా ఉందని, కిరాయి ఎక్కువగా ఉందని, దానిని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. పరిశ్రమలకు ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కింద మాకు సబ్సిడీపై భూమి కేటాయిస్తే గోదాములు నిర్మించుకుంటామని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా మిర్చిని ఆరబెట్టుకునేందుకు డ్రయర్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆర్‌జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సీజన్ ప్రారంభం నాటికి యార్డులో అన్ని మౌలిక వసతులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 12వ తేదీ(సోమవారం)న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మార్కెట్ యార్డును సందర్శించేందుకు ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, యార్డు అధికారులు వెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డీడీ దివాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, ఎగుమతి వ్యాపారులు జుగిరాజ్ భండారీ, కొత్తూరి సుధాకర్, తోట రామకృష్ణ పాల్గొన్నారు.
మార్కెటింగ్ శాఖ ఆర్‌జేడీ శ్రీనివాసరావు