నయా కవులు... ఫేక్ డాక్టరేట్లు
తెనాలి: దుగ్గిరాలకు చెందిన గుర్రం జాషువా కళాపరిషత్ నిర్వాహకుడు పెద్దీటి యోహానును ఆదివారం హైదరాబాద్‌లో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్రభారతిలో ఏడుగురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసే కార్యక్రమంపై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు, నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు. గుర్రం జాషువా పేరుతో కళాపరిషత్‌ను స్థాపించి ఏటా వర్ధంతి, జయంతి జరుపుతుడటం, రాష్ట్రవ్యాప్తంగా పలువురిని ఎంపిక చేసి రకరకాల పేర్లతో సత్కరిస్తుండటం ఆయనకు పరిపాటి. తన సంస్థను ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన సంస్థగా చెప్పుకుంటూ కొన్నేళ్లుగా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయసాగాడు. విజయవాడతో ఆరంభించి, హైదరాబాద్‌కు ఎదిగాడు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఆసక్తి చూపిన వ్యక్తులనుండి డబ్బులు దండుకుని వారిని గౌరవ డాక్టరేట్లను ఎడాపెడా ఇచ్చేయసాగాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లో ఎవరో ఫిర్యాదుతో పోలీసుల చేతికిచిక్కాడు. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రముఖులనూ ఆహ్వానించటం మరో టెక్నిక్! రవీంద్రభారతిలో యోహానును అరెస్టు చేసినపుడు వేదికపై ఉన్నవారు ప్రముఖులే! కవిగా, రచయితగా చలామణి అవుతూ చిన్నాచితకా టీవీ ఏపీసోడ్లు, సినిమాల్లో క్యారెక్టర్లు వేస్తూ వచ్చిన విశ్రాంత వెటరనరీ ఉద్యోగి యోహాను కళాపరిషత్ పేరుతో చేస్తున్న నిర్వాకం బట్టబయలు కావటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.
కొన్ని క్రైస్తవ సంఘాలు, చర్చి, మినిస్ట్రీలు మతసేవ, సమాజసేవ, బైబిల్ అధ్యయనంలో కృషి చేసిన వారికి గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నాయి. ఇది విద్యార్హత కాదు. కొన్నిచోట్ల రిజిస్టర్డ్ బైబిల్ కళాశాలలు, థియాలజీ విశ్వవిద్యాలయాలు బైబిల్ అధ్యయనాలపై సాధారణ పాఠ్యప్రణాళికతో కూడిన డాక్టరేట్లు ఇస్తాయి. ఇవన్నీ మతపరంగా చెల్లుబాటు అయ్యేవి మినహా, యూజీసీ గుర్తింపు లేనివి. క్రైస్తవ సమాజంలో వీటికి గుర్తింపు ఉంటుంది. కొన్ని విదేశాలకు చెందిన సంస్థలు కూడా నగరాల్లో సభలను ఏర్పాటుచేసి గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నాయి. అదలా ఉంచితే విద్య, కళా, సాహిత్య రంగాల పేరుతో ఇస్తున్న నకిలీ డాక్టరేట్లకు హీనపక్షం రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు డబ్బు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకోసం తాపత్రయపడే నయాకవులు/రచయితల్లో కొందరు డబ్బులు ఇచ్చేసి రాత్రికి రాత్రి పేరుప్రఖ్యాతలు సంపాదించుకోవాలని చూస్తున్నారు. వీరి ఆశకు తగినట్టే ఊరూపేరూ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంతో ఇలాంటివారిని రెచ్చగొడుతున్నాయి వారి ఆశలను సొమ్ము చేసుకుంటూ పప్పుబెల్లాల్లా ఫేక్ డాక్టరేట్లను అందజేస్తున్నాయి.
‘కవిగారూ...మీకు డాక్టరేట్ ఎవరిచ్చారు...?
కొందరు కవులు/రచయితల వాట్సాప్ గ్రూపులో తెనాలికి చెందిన ఒకరు తన పేరుకు ముందు డాక్టర్‌ను చేర్చుకోవటంతో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ తీసుకున్న ఓ మహిళ వేసిన ప్రశ్న ఇది!
‘ఫలానా సంస్థ రూ.150 చెల్లిస్తే ఇచ్చింది...’ అంటూ సదరు కవిగారు సమాధానమిచ్చారు.
‘అలా ఎలా ఇస్తారు...ఏవిధంగా తీసుకుంటారు...నేను కేసు పెడతా’నంటూ ఆ మహిళ ఆగ్రహోదగ్రురాలైంది...ఇది జరిగి నాలుగురోజులైనా కాలేదు.
1/1
నయా కవులు... ఫేక్ డాక్టరేట్లు