
పరిశ్రమల మంజూరులో జాప్యం వద్దు
కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: జిల్లాలో పరిశ్రమలకు అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి(డి.ఐ.ఇ.పి.సి) సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖలు నిర్దేశిత సమయంలో మంజూరు అనుమతులు జారీ చేయాలని కోరారు. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన జీవీఏ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ‘ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త‘ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబంపై దృష్టి సారించాలని తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించాలని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన పరంగా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం కింద 26 యూనిట్లను మంజూరు చేశామన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి 1,169 మంది అర్హత సాధించగా రూ.1.53 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. 4 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు పెట్టుబడి రాయితీగా రూ.75.47 లక్షలు, 6 యూనిట్లకు వడ్డీ రాయితీగా రూ.7.33 లక్షలు ఉందని తెలియజేయగా కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయి కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
తురకపాలెంలో స్థానికుల సహకారం అవసరం
గుంటూరు రూరల్: తురకపాలెంలో అనారోగ్య పరిస్థితులు నియంత్రణకు స్థానికులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా కోరారు. తురకపాలెంలో మంగళవారం పర్యటించారు. గ్రామస్తులతో రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడుతూ గ్రామం ఆరోగ్య సంరక్షణకు నిలయం కావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ ఆరోగ్యస్థితి గతుల సమాచారం పక్కాగా అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరిని కాపాడటమే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు.