కొండ భూమిని వదలని కూటమి నేతలు
కొండ భూమిని వదలని కూటమి నేతలు లాం(తాడికొండ): రాజధాని పరిధిలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. కబ్జాలకు బరితెగించారు. విలువైన స్థలాలపై కన్నేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా సొంతం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తాడికొండ మండలం లాంలో కొండ పోరంబోకు భూమిని శ్మశానం కోసం రెండు ఎకరాలు ముస్లింలు రిజర్వు చేసుకున్నారు. ఆ స్థలాన్నే ఓ టీడీపీ మైనారిటీ నేత స్వాధీనం చేసుకున్నాడు.
వివరాలు.. గ్రామ సర్వే నంబర్ 199/ఏలో కొండ పోరంబోకు భూమి ఉంది. సుమారు 23 ఎకరాల్లో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అందులో రెండు ఎకరాల పరిధిలో ముస్లింలు శ్మశాన వాటిక కోసం ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మించారు. తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ మైనారిటీ నేత కన్ను ఆ భూమిపై పడింది.
అదే స్థలాన్ని పొక్లెయిన్‌తో గోడలు తొలగించి మరీ ఆక్రమణకు పాల్పడ్డాడు. ఆ భూమిని ఆక్రమించి ఓ భారీ బ్రిక్స్, నిర్మాణ రంగానికి అవసరమైన సిమెంటు సామగ్రి తయారీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాడు. ఇప్పటికే అర ఎకరా భూమిలో బెడ్‌ల నిర్మాణం పూర్తి చేయగా అధికారికంగా కరెంటు కనెక్షన్ తీసుకునేందుకు మరో మోసానికి తెరలేపాడు.
అది మసీదుకు చెందిన స్థలంగా చూపించి వారి వద్ద నుంచి తాను లీజుకు తీసుకున్నట్లు ఓ దస్త్రం తయారు చేయించి ప్రభుత్వ భూమిలో కరెంటు మీటరు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి గ్రామ పంచాయతీ ఎన్‌ఓసీ జారీ చేయాల్సి కోరాడు. ప్రభుత్వ స్థలానికి ఎన్‌ఓసీ జారీచేస్తే తాము ఎక్కడ ఇరుక్కుంటామో అనే మీమాంసలో తలలు పట్టుకుంటుండగా ఎన్‌ఓసీ జారీకి పట్టుబట్టి తీసుకున్నట్లు సమాచారం. సదరు భూమిని ఆక్రమణలో తనకు ఎవరైనా అడ్డుగా వస్తే అధికార పార్టీని అడ్డుపెట్టుకొని వారిపై తప్పుడు కేసులు బనాయిస్తానంటూ బెదిరింపులకు దిగడంతో ఫిర్యాదు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
భూ కబ్జాపై లాం వీఆర్వో మధుసూదనరావును వివరణ కోరగా ఆ భూమి రికార్డు దాఖలా కొండ పోరంబోకు భూమిగానే నమోదై ఉంది. మసీదు స్థలంగా చెబుతున్నారు, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నా...
సదరు టీడీపీ నాయకుడిపై భూ కబ్జా వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తెనాలికి చెందిన కొందరు ఇక్కడ భూమిని కొనుగోలు చేసి అందులో నిర్మాణం చేసేందుకు రాగా వారిపై దౌర్జన్యం చేసి కొట్టిన కేసులో అట్రాసిటీ కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఏమైనా పనులు అతడి అనుమతి లేకుండా చేస్తే అధికారులను ఇబ్బందులకు గురిచేసి దాడులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తప్పుడు ఫిర్యాదులతో ఇటీవల వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులపై కేసులు నమోదు చేయించి, జైల్లో పెట్టించాడు. లాంలో లేబర్ కో ఆపరేటివ్ సొసైటీపై తప్పుడు ఫిర్యాదులు, కేసులు వేసి వందలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశాడు. అధికార పార్టీని, అధికార ప్రజా ప్రతినిధిని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడిపై తగిన చర్యలు తీసుకొని రూ.20 వేల కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించాలని పలువురు కోరుతున్నారు.
● రూ.20 కోట్ల విలువైన భూమి కబ్జా
● మసీదు స్థలంగా చూపించి బ్రిక్స్
ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు
● గతంలో పేదల ఇళ్లు కూల్చి
ఇప్పుడు దొడ్డిదారిలో కబ్జా
● అధికార పార్టీ పెద్దల ఆశీస్సులతోనే
కబ్జాకు దారులు అంటున్న గ్రామస్తులు
● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
మసీదు స్థలంగా చూపి..
వీఆర్వో ఏమన్నారంటే...
1/1
కొండ భూమిని వదలని కూటమి నేతలు