
చైల్డ్ సేఫ్టీ
‘పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత తీసుకోవడం అంటే ఇది’ అంటూ ఒక క్యాబ్ డ్రైవర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు అతడి వృత్తినైపుణ్యాన్ని, అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ‘పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా జాగ్రత్త పడడం ప్రతి స్కూల్ క్యాబ్ డ్రైవర్ బాధ్యత’ అనే కాప్షన్‌తో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీడియోలో ఏముంది? అనే విషయానికి వస్తే... స్కూల్ క్యాబ్ నుంచి బయటికి దిగిన బాలిక తన ఇంటివైపు పరుగులు తీస్తూ కనిపిస్తుంది. ‘క్యాబ్ డ్రైవర్ మిత్రులారా, నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మాయి క్యాబ్ దిగగానే మన బాధ్యత తీరినట్లు కాదు. ఆ పాప ఇంట్లోకి అడుగుపెట్టేవరకు కాబ్ కదలకూడదు’ అనే మాటలు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వినిపిస్తూ ఉంటాయి. ‘ప్రతి క్యాబ్ డ్రైవర్ నీలా ఆలోచిస్తే పిల్లల భద్రతకు ఎలాంటి సమస్య ఉండదు’ అని ఒక నెటిజన్ స్పందించారు. ‘మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు పిల్లల భద్రత విషయంలో కీలకం అవుతాయి’ అని మరోసారి గుర్తు చేసే వీడియో ఇది.