
జాతీయ ఫెన్సింగ్‌లో శేషురిషిత్‌రెడ్డి ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్‌ఈ జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ 2025–26 పోటీల్లో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి నల్లమిల్లి శేషురిషిత్‌రెడ్డి ఒక మార్కు తేడాతో మూడో స్థానం పొంది కాంస్య పతకం సాధించాడు. ఉత్తరాఖండ్ రుద్రపూర్‌లో గత నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకూ నిర్వహించిన పోటీల్లో 1,400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ క్రీడా శాఖ మంత్రి రేఖా ఆర్యా, నేషనల్ ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్‌మెహతా కాంస్య పతకం అందజేశారు.
శేషురిిషిత్‌రెడ్డిని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి అభినందించారు. జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో తొలిసారిగా ఏపీ నుంచి పాల్గొని ప్రతిభ చూపడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌లో ఇదే తరహాలో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలన్నారు. స్కూల్ అధినేత సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ వందనబోహ్ర కూడా అభినందించారు.
నదిలో పడిన వ్యక్తి మృతదేహం లభ్యం
మలికిపురం: దిండి–చించినాడ వంతెన పైనుంచి గోదావరిలో పడిన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తుండడంతో.. అందుకు నిరాకరిస్తూ.. బెదిరించాలన్న ఉద్దేశంతో వంతెన ఎక్కిన అతడు అదుపుతప్పి నదిలోకి పడిపోయాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, సఖినేటిపల్లి మండలం వీవీ మెరక గ్రామానికి చెందిన మేడిది సుదర్శనరాజు (25)కు రష్యాలో రూ.1.50 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చింది. అతడి నానమ్మతో పాటు, కుటుంబ సభ్యులు ఉద్యోగానికి వెళ్లాలంటూ ఒత్తిడి తెచ్చారు.
మద్యానికి బానిసైన సుదర్శనరాజు అక్కడకు వెళ్లనని భీష్మించాడు. ఈ నేపధ్యంతో ఈ నెల ఐదో తేదీన దిండి–చించినాడ వంతెనపైకి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ, అదుపుతప్పి వంతెన పైనుంచి నదిలో పడిపోయాడు. అతడి మృతదేహం మంగళవారం అంతర్వేది పల్లిపాలెం వద్ద నదీ తీరంలో లభించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పీవీవీ సురేష్ తెలిపారు.
వెబ్‌నార్‌లో ‘నన్నయ’ అధ్యాపకులు
కాకినాడ రూరల్: అంతర్జాతీయ డీసిస్ వెబ్‌నార్‌లో నన్నయ ఎంఎస్‌ఎన్ పీజీ సెంటర్‌కు చెందిన పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. భారత్–యూరోపియన్ యూనియన్ సంబంధాలపై విద్యార్థుల చురుకై న చర్చతో పాటు, ఎకనామిక్ డెమోక్రసీ అండ్ సోషల్ ఎకానమి తదితర అంశాలపై చర్చ జరిగింది. నన్నయ అధ్యాపకులు మనోజ్ దేవా, మధుకుమార్, అప్పారావు, మణికంఠేశ్వరరెడ్డి, శ్రీదేవి, ఉమా రజిత, యూరోపియన్ యూనియన్ నుంచి స్టెఫాన్ చచెవాలీవ్, అన్నా గలాజ్కా, ఫ్రెడరిక్ డుఫేస్, ఫ్రాంజిస్కా గోర్మార పాల్గొన్నారు.