
ఆహార తయారీ కేంద్రాల విస్తృత తనిఖీలు
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా వివిధ హోటళ్లలో, వ్యాపార కేంద్రాల్లో విపరీతమైన కల్తీ, ఆహార తయారీలో నాణ్యత లోపం, నిల్వ సరకుల సరఫరా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ నిషాంతి.. జిల్లాలోని ఆహార తయారీ కేంద్రాల తనిఖీకి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా డీఎస్‌వో ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో పౌర సరఫరాల, ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖల సంయుక్తాధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. దాదాపు 200 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగిన తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీఎస్‌వో చెప్పారు. జేసీ నిషాంతి స్పందిస్తూ, ఎక్కడా ఆహార కల్తీలు కానీ, నాణ్యత లేని, అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని సరఫరా చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇలాంటి తనిఖీలు విస్తృ తంగా చేపడతామని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన నియమాలను అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తప్పక పాటించాలన్నారు. కొన్నిచోట్ల ఈ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆహారం కల్తీ కావడం, నాణ్యత తగ్గడం జరుగుతున్నాయని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆయా యజమాన్యాలు వ్యవహరించాలని ఆదేశించారు. నిల్వ, కాలం చెల్లిన, హానికర పదార్థాలు ఆహార తయారీలో వినియోగించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఫుడ్ సేఫ్టీ, తూనికలు–కొలతల శాఖల జరిమానాలతో పాటు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తప్పవన్నారు. భద్రతతో కూడిన ఆహారం అందించకపోతే వ్యాపారాలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. తనిఖీల్లో జిల్లా తూనికలు–కొలతల అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా ఆహార భద్రత అధికారి రామయ్య, పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. హోటళ్లలో ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, కల్తీ, వంటి సమస్యలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు డీఎస్‌వో ఉదయభాస్కర్ చెప్పారు.
జిల్లాలో 200 చోట్ల
ఏకకాలంలో నిర్వహణ
కల్తీ, నిల్వ లోపాలు గుర్తించి
అధికారుల తక్షణ చర్యలు
లైసెన్స్ రద్దు చేస్తామని జేసీ హెచ్చరిక