
వేగంగా విశ్రాంతి షెడ్డు నిర్మాణం
● పనులను పరిశీలించిన
కమిషనర్ రామచంద్రమోహన్
● కార్తికమాసం నాటికి
పూర్తి చేయాలని ఆదేశం
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం ఎదురుగా నిర్మిస్తున్న భక్తుల విశ్రాంతి షెడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన ‘లారెస్’ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గత నెల మూడో తేదీన ఈ షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు గల ఖాళీ ప్రదేశంలో సుమారు మూడు వేల మంది భక్తుల సేద తీరేలా దీనిని నిర్మిస్తున్నారు. 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో విశ్రాంతి షెడ్డు నిర్మించనున్నారు. షెడ్డు చుట్టూ ఐదు అడుగుల మేర షేడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. సుమారు 10,625 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం టిక్కెట్లు విక్రయించేందుకు వీలుగా 12 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వాటి ముందు స్టెయిన్‌లెస్ స్టీల్ క్యూ లు, మూడు హెలికాఫ్టర్ (హై వాల్యూమ్ లో స్పీడ్ ) ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్లు స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విశ్రాంతి షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేసి ఎప్పటి కప్పుడు క్లీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి షెడ్డు రూఫ్ వరకు పూర్తయింది. పనులను దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ మంగళవారం ఉదయం పరిశీలించారు. షెడ్డు పనుల పురోగతి గురించి ఆయనకు దేవస్థానం ఈఓ సుబ్బారావు, ఈఈ రామకృష్ణ వివరించారు. కార్తికమాసం నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ ఆదేశించారు.