
కార్యకర్తపై మండిపడ్డ మంత్రి దుర్గేష్ బంధువు
నిడదవోలు : పదేళ్ల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఓ కార్యకర్తపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బంధువు ప్రశాంత్ దుర్భాషలాడుతూ మండిపడ్డ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఫణీంద్రకుమార్‌ను ఇటీవల విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిఫారసు చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన అంజి అనే జనసేన కార్యకర్త మంత్రి దుర్గేష్ అనుచరుడు ప్రశాంత్‌కి ఫోన్ చేసి అసలు గ్రామంలో ఎంకై ్వరీ చేయకుండా పదవి ఎందుకు ఇచ్చారంటూ నిలదీశాడు. గ్రామంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా పదవి ఎలా ఇచ్చారంటూ అంజి ప్రశ్నించాడు. దీంతో ప్రశాంత్ కార్యకర్త అంజిపై విరుచుకుపడ్డాడు. పార్టీ పదవుల విషయంపై నీకు ఏమిటి సంబంధం, నువ్వు ఎక్కువగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాకు సంబంధం లేదా అంటూ కార్యకర్త అంజి వాపోయాడు. మంత్రి దుర్గేష్ ఇష్ట ప్రకారం డైరెక్టర్ పదవి ఇచ్చారని, ఎక్కువగా మాట్లాడితే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ప్రశాంత్ అన్నాడు. పార్టీ పట్ల నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. మంత్రి కందుల దుర్గేష్‌కి ఫోన్ చేసి అడుగుతానని కార్యకర్త అంజి చెప్పడంతో మంత్రితో నువ్వు మాట్లాడతావా నువ్వు ఎంత..నీ స్థాయి ఎంత.నువ్వు కేవలం కార్యకర్తవు మాత్రమే.. లీడర్‌ను అనుకుంటున్నావా అంటూ మండిపడ్డాడు.
వైరల్ అవుతున్న ఆడియో