
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బోయవాడైన ఒక సాధారణ మనిషి మహా రుషిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించిచడం గొప్ప విశేషమని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఆదికవి వాల్మికి జయంతిని మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్ రాజ్ మహార్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇతిహాసాలలో తొలి కావ్యంగా పేరుగాంచిన రామాయణం గ్రంథాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం మనకందరికీ ఆదర్శప్రాయమన్నారు. రామాయణం వంటి మహాకావ్యాన్ని ఈ సమాజానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి వాల్మీకి అని ఆయన కొనియాడారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం.లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, సెట్రాజ్ సీఈవో కెఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.