సద్వినియోగం చేసుకోవాలి
వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా..
వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే చక్కటి కార్యక్రమం. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో దేశభక్తిని చాటేలా, వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి.
– జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, సమగ్ర శిక్షా,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
● విద్యార్థులకు వీరగాథ 5.0
● మూడు నుంచి 12వ తరగతుల వారికి పలు పోటీలు
● కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ
● ఈ నెల 31తో ముగుస్తున్న గడువు
రాయవరం: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు అంశాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు విధించారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు పంపింది.
నాలుగు విభాగాల్లో..
పాఠశాలల వారీగా ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు.
ఎంచుకోవాల్సిన అంశాలు
వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్‌గా ఎంచుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీలక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే.. ఏం చేస్తారో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథఽలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు.
నమోదు విధానం
ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా.మై జీవోవీ.ఇన్/వీర్.గాథ 5.0 అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్‌మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్‌లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.
ఇప్పటికే ప్రతిభ కనబరుస్తూ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 2,030 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యల పరిధిలో 2.08 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు.
దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..
దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..