
సత్యదేవుని సన్నిధిలో త్వరలో సంప్రోక్షణ, శాంతి పూజలు
● దేవస్థానం చైర్మన్ రోహిత్,
ఈఓ సుబ్బారావు వెల్లడి
● పండితుల సమావేశంలో నిర్ణయం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ, శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులతో కూడిన వైదిక కమిటీ నిర్ణయించింది. మంగళవారం ‘సాక్షి’లో ‘అపశ్రుతులు అందుకేనా..?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పండితులతో సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కానీ, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడంతో మూడు నెలలుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నట్టు ఆ కథనంలో వెలువడింది. అదేవిధంగా రెండు నెలల క్రితం సిక్స్ వీఐపీ సత్రంలో భక్తుడు మరణించినప్పటికీ, అతడు కొండ దిగువన ఆస్పత్రిలో మృతి చెందాడని భావిస్తూ సంప్రోక్షణ పూజలు చేయలేదని కూడా పేర్కొనడం జరిగింది. వీటిపై స్పందించిన చైర్మన్, ఈఓలు మంగళవారం పండితులతో కూడిన దేవస్థానం వైదిక కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్తిక మాసం లోపుగా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ పూజల తేదీని నిర్ణయించాలని పండితులను కోరినట్టు చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు.

సత్యదేవుని సన్నిధిలో త్వరలో సంప్రోక్షణ, శాంతి పూజలు