
సెల్‌ఫోన్, నగదు కోసమే హత్య
● ఇద్దరు నిందితుల అరెస్టు
● మారణాయుధం, సొత్తు స్వాధీనం
సామర్లకోట/తుని రూరల్: తాగిన మైకంలో ఓ యువకుడితో గొడవపడి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.ఐదొందలు నగదు కోసం అతడిని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రూరల్ పరిధిలోని నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఈ నెల రెండో తేదీన రాత్రి తుని రైల్వే ఫ్‌లైఓవర్ బ్రిడ్జి కింద (నర్సీపట్నం బస్టాండ్ వద్ద) జరిగిన గుర్తు తెలియని యువకుడి హత్య సంచలనం రేపింది. కాకినాడ జిల్లా ఎస్సీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హత్య కేసును ఛేదించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వివరాలు వెల్లడించారు.
గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆ సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంటూ లేకపోవడంతో వారు ఆకతాయిలుగా తిరుగుతున్నారు.
వీరిద్దరూ ఈ నెల రెండున రాత్రి బస్టాండ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తానార అప్పలనాయుడు(37) బస్టాండ్ వద్దకు వచ్చాడు. నిందితుల వద్దకు వచ్చిన సమయంలో పరధ్యానంలో అప్పలనాయుడు వారిపై పడబోయాడు. దాంతో సురేష్ అతడిని తోసేయడంతో జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్ కిందపడింది. చొక్కా జేబులో నగదు కనిపించింది. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు కాజేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. అతడి సెల్‌ఫోన్, నగదును నిందితులు లాక్కునే క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న రాయి, ఇనుప రాడ్డుతో నిందితులు కలిసి అప్పలనాయుడిపై దాడి చేశారు. ఇష్టానుసారం కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి, సెల్‌ఫోన్, నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, సంఘటన స్థలిలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివార్లలో తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చుతామన్నారు. కేసును ఛేదించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచారి, తొండంగి ఎస్సైలు జగన్‌మోహన్, జె.విజయబాబు, సిబ్బంది, ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.

సెల్‌ఫోన్, నగదు కోసమే హత్య