
ఐటీఐలో మెరిసినగిరిజన విద్యార్థిని
ముంచంగిపుట్టు: అలిండియా ట్రేడ్ టెస్ట్–2025లో రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ కోర్సులో జాతీయస్థాయిలో మెరిసిన గిరిజన విద్యార్థిని మధులతను పలువురు అభినందించారు. మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రానికి చెందిన పాంగి డొమైలా కుమార్తె పాంగి మధులత విశాఖపట్నంలోని కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో 2024–25 విద్యా సంవత్సరంలో రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ కోర్సు చదివింది. ఈ ట్రేడ్‌లో 1200 మార్కులకు గాను 1194 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఢిల్లీలో శనివారం జరిగిన స్కిల్ కాన్వోకేషన్ సెర్మనీ–2025 వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకుంది. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ తండ్రి రామదాసు మాచవరంలో గ్రామ తలయారీగా పనిచేస్తూ చదువుకునేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించారని పేర్కొంది. తండ్రి మృతితో ఆ ఉద్యోగంలో తల్లి డొమైలా కొనసాగుతూ అన్నివిధాలుగా సహకారం అందిస్తోదన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానానికి ఎదిగి నేవిల్ డాక్‌యార్డులో ఉద్యోగం సాధిస్తానని పేర్కొంది. ఆమెను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
జాతీయస్థాయిలో ఆర్ అండ్ ఏసీ ట్రేడ్‌లో మొదటి ర్యాంకు
సాధించిన మధులత
ప్రధాని చేతులమీదుగా అవార్డు
పలువురి అభినందన