
ఆంక్షలు విధించినా ఆగేది లేదు!
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మాకవరపాలెం మెడికల్ కాలేజీకి
రోడ్డు మార్గానే వెళ్తారు
హెలిప్యాడ్‌కు అనుమతి ఇస్తామనడంలో కుట్ర కోణం ఉందన్న అనుమానాలున్నాయి
65 వేల మంది జనాలు వస్తారని
పోలీసులు చెబుతుండడం చూస్తుంటే
ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోంది
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లా అధ్యక్షులు అమర్‌నాథ్, కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించడానికి ఈనెల 9వ తేదీన వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్రచేస్తోందని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఆగేది లేదని స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు భద్రత కల్పించాలని ఐదు రోజుల క్రితమే అనకాపల్లి ఎస్పీ, విశాఖ సీపీని కోరామని, ఇప్పటివరకూ కాలయాపన చేసిన వారు జాతీయ రహదారిపై రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని ఇప్పుడు చెబుతున్నారన్నారు. విశాఖ నుంచి మాకవరపాలేనికి జాతీయ రహదారి కాకుండా ప్రత్యామ్నాయ రోడ్డు చూపించాలని అడుగుతున్నామన్నారు. అయినా పర్యటనకు తాము అనుమతి కోరలేదని.. సెక్యూరిటీ కల్పించాలని మాత్రమే అడిగామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వస్తున్నప్పుడు మీ పర్మిషన్ ఎవరికి కావాలంటూ ధ్వజమెత్తారు. తమ నాయకుడు రోడ్డు మార్గానే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వం భద్రత కల్పించకపోతే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని అన్నారు. గతంలో వైఎస్ జగన్ పలు పర్యటనల్లో హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదని.. ఇప్పుడు హెలికాప్టర్ మీదే రావాలంటున్నారంటే.. తనతో పాటు రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు, అభిమానులకు అనుమానం వస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సవ్యంగా లేని సమయంలో పదే పదే హెలిప్యాడ్ అనుమతి కోరండి అని చెబుతుంటే, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందేమోనని అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జరిగిన సంఘటనను బూచిగా చూపించి అనుమతి ఇవ్వలేమనడం సరికాదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు 65 వేల మంది జనాలు వస్తారని పోలీసులు చెబుతుండడం చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు.
చంద్రబాబు పర్యటనను ఆపేస్తారా?
గతంలో చంద్రబాబు ప్రచార పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 29 మంది, కందుకూరిలో 9 మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2027లో మళ్లీ గోదావరి పుష్కరాలు ఉన్నాయని, పుష్కరాల సమయంలో చంద్రబాబు పర్యటనను ఆపేస్తారా? అని ప్రశ్నించారు.
అయ్యన్నపాత్రుడి నోటికి తాళాలేసేందుకు..
కళ్లు బైర్లు కమ్మి సవాల్ విసిరిన స్పీకర్ అయ్యన్న లాంటి వారి నోటికి తాళాలు వేసేందుకు, ఆయన అసత్య ప్రచారాలకు చెక్ పెట్టి.. మెడికల్ కాలేజీపై వాస్తవాలను తెలియజేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 9న మాకవరపాలెం వస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు.