నగలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోండి
చైన్ స్నాచర్స్‌పై అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: దసరా, బతుకమ్మ పండుగల ఏర్పాట్లలో ప్రజలు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇదే అదును భావించిన దొంగలు స్వైరవిహారం చేస్తుంటారు. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం పట్టణాల నుంచి పల్లె బాట పడుతున్నారు. కొత్త బట్టలు, వస్తువుల కొనుగోలుకు షాపింగ్ చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇదే సమయంలో దొంగలు, చైన్‌స్నాచర్స్, పిక్‌పాకెటర్స్ చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నెల 23న అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెడ్డిగ్యాంగ్ సంచారం కలకలం రేపింది. సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. గోదావరివాడలో మరో ఇంట్లో చోరీకి యత్నించగా పోలీసులు తిప్పికొట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులను మంచిర్యాల డీసీపీ భాస్కర్ అప్రమత్తం చేశారు. రాత్రి 10గంటలు దాటిందంటే అనుమానాస్పదంగా కనిపించిన వారిపై కొరఢా ఝలిపిస్తున్నారు. పెట్రోలింగ్ నిఘా పెంచారు. వేలిముద్రలు సేకరిస్తూ జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై నిఘా పటిష్టం చేశారు.
ఇవి పాటించండి..
నగలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోండి ● చైన్ స్నాచర్స్‌పై అప్రమత్తంగా ఉండాలి
● ఊరు వెళ్లే వారు పక్కింటి వాళ్లకు చెప్పాలి. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం ఇస్తే పోలీసులు వీధుల్లో నిఘా వేస్తారు.
● వైఫై బేస్‌డ్ రోబో కెమెరాను అమర్చుకోవాలి. దీంతో ఇళ్లలో జరిగే విషయాలపై సెల్‌ఫోన్‌కు అలర్ట్ రింగ్‌టోన్ వస్తుంది. అది వారికి వినిపించదు. దొంగతనం చేస్తుండానే పట్టుకునే అవకాశం ఉంటుంది. నాలుగు సెల్‌ఫోన్‌లకు వినియోగించుకోవచ్చు. ఒక పోలీస్ అధికారి నంబరు కూడా ఇవ్వొచ్చు.
● సైరన్ మోగే తాళాలు సైతం మార్కెట్‌లో లభిస్తున్నాయి. స్థోమతను బట్టి కొనుగోలు చేయవచ్చు. తాళం కదిలించే ప్రయత్నం చేస్తే సైరన్ మోగుతుంది. దీంతో పక్క ఇళ్లవారు అప్రమత్తం కావొచ్చు.
● అపార్టుమెంట్లలో వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి.
● గుర్తు తెలియని వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి.
● ఇళ్లలోని బంగారు ఆభరణాలు, నగదు, విలువైనవి బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి.
ప్రయణంలోనూ..
ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, రైళ్లలో ప్రయాణించే వారు విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొందరు మాయమాటలు చెప్పి నగదు, నగలు, బ్యాగులు కాజేసే ప్రమాదం ఉంటుంది. కళ్లు మూసి తెరిచేలోపు మాయమైపోతారు. సీసీ పుటేజీ కవరేజి ఉండే ప్రాంతంలో ఉండాలి. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. రాత్రివేళ, మద్యం సేవించి ప్రయాణం చేయడం మంచిదికాదు. ఏదైనా సమస్య, రోడ్డు ప్రమాదం సంభవిస్తే కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందేలా ఫోన్‌నంబర్లు, అడ్రస్ అందుబాటులో ఉంచుకోవాలి. 100 డయల్, 108కు సమాచారం అందించాలి.