
ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్: ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వి నియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ ఎస్.భవానీ ప్రసాద్ అన్నారు. దసరా పండుగ పురస్కరించుకొని ఆర్టీసీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 27నుంచి అక్టోబర్ 6వరకు ఆర్టీసీలో ప్రయాణించిన వారిలో రీజియన్ వ్యాప్తంగా ముగ్గురిని డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. పండుగ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించామన్నారు. అనంతరం విజేతలను ప్రకటించారు. వైభవ్ (ప్రథమ, రూ.25వేలు), గణేశ్(ద్వితీయ, రూ.15వేలు) మహేశ్ (తృతీయ, రూ.10వేలు) బహుమతులకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరికి త్వరలో హైదరాబాద్ వేదికగా నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాస్, రవీందర్, డిప్యూటీఆర్‌ఎం శ్రీహర్ష, రామయ్య, సీఐ రాజశేఖర్, ఎంఎఫ్ శ్రీకర్, ఎస్‌ఎం పోశెట్టి, రిజర్వేషన్ ఇన్‌చార్జి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.