
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కై లాస్‌నగర్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నామినేషన్ల ప్రక్రియపై జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్‌డ్రా, గుర్తుల కేటాయింపు ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలన్నారు. సమయపాలన పక్కాగా పాటించాలని, ఆర్‌వో గదిలో వాల్‌క్లాక్ ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అనే దాన్ని ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారించుకోవాలన్నారు. ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయించాలన్నారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయాలని తెలిపారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఖాతా తెరిచి నామినేషన్ల సమయంలోనే అందించాలన్నారు. ఎన్నికల ఖర్చులు మొత్తం ఈ ఖాతా నుంచే నిర్వహించాలని తెలిపారు. ప్రతీ ఆర్‌వో కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేలా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నోటిఫికేషన్ జారీకి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలని తద్వారా నిర్వహణలో తప్పిదాలకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. సమస్యత్మాక కేంద్రాలపై తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్‌హెచ్‌ఓలు సంయుక్తంగా చర్చించి వాటి వివరాలతో కూడిన జాబితాలను గురువారంలోగా అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, ఏఎస్పీ కాజల్ సింగ్, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.