
ప్రొసీడింగ్.. జాప్యం
కైలాస్‌నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్– 2020 స్కీం కింద ఫీజు లో 25శాతం రాయితీ కల్పిస్తూ మే 3వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో దీనికి ఆశించిన మేర స్పందన లభించలేదు. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందినప్పటికీ ఫీజు చెల్లింపునకు మాత్రం అంతగా ముందుకు రాలేదు. మరోవైపు ఫీజు చెల్లించిన వారి విషయంలో బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శి స్తున్నారు. క్షేత్రసాయి పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రొసీడింగ్ ఆర్డర్ల జారీలో తీవ్ర జాప్యమవుతోంది. దీంతో ఫీజు చెల్లించిన వారికి నిరీక్షణ తప్పడం లేదు.
స్పందన నామమాత్రమే..
గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ స్కీంకు 2020లో శ్రీకా రం చుట్టింది. నాడు మీసేవ కేంద్రాల్లో రూ.1000 చె ల్లించి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీ కరించాలని ఇటీవల కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. 25శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపున కు రెండు నెలల పాటు అవకాశం కల్పించింది. దీంతో బల్దియాకు భారీగా ఆదాయం సమకూరుతుంద ని భావించారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.దరఖాస్తుదారుల్లో సగంలో సగం మంది కూడా ఫీజు చెల్లించలేదు. చెల్లింపులోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, చాలామంది ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వెనుకడుగు వేయడం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం వారు అంతగా ముందుకు రానట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఫీజు చెల్లించినా.. అందని ప్రొసీడింగ్
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి నెలల తరబడి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించకపోవడం బల్దియా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో ఇంకా 602 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాల్సిన అధికారుల తీరుపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రొసీడింగ్ అందకపోవడంతో ఇళ్లను నిర్మించుకోవాలని భావిస్తున్న వారు అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నా రు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సత్వరం అందేలా చూడాలని కోరుతున్నారు.
మున్సిపల్‌లో అందిన దరఖాస్తులు : 22,489
ఫీజు చెల్లింపునకు అర్హులు : 17,854
ఫీజు చెల్లించిన వారు : 4,498
జారీ చేసిన ప్రొసీడింగ్ పత్రాలు : 3,806
బల్దియాకు చేకూరిన ఆదాయం : రూ.9కోట్లు
ప్రక్రియ వేగవంతం చేశాం
ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తుదారుల ప్లాట్ల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేశాం. ఇందుకోసం పది మంది వార్డు ఆఫీసర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వారికి లాగిన్ ఐడీలు సైతం కేటాయించాం. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.
– సుమలత, టౌన్‌ప్లానింగ్ అధికారి