
ఇక వారి పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలకే..
మున్సిపల్‌లో విలీనమైన ఆరేళ్ల తర్వాత
1,608 మందికి తప్పనున్న తిప్పలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమై ఆరేళ్లుగా మావలలోనే చేయూత పింఛన్ డబ్బులు పొందుతున్న వారి కష్టాలు ఎట్టకేలకు దూరం కానున్నాయి. ఇక నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లోనే జమ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ పరిధిలోని 13 కాలనీలకు..
ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న దస్నాపూర్, దోబీకాలనీ, దుర్గానగర్, హన్‌మాన్‌నగర్, న్యూహౌసింగ్‌బోర్డు, కై లాస్‌నగర్, పిట్టలవాడ, రాంనగర్, షాద్‌నగర్, సుభాష్‌నగర్, టైలర్స్‌కాలనీ, టీచర్స్‌కాలనీ, కేఆర్‌కే కాలనీలు గతంలో మావల మేజర్ గ్రామ పంచాయతీ పరిదిలో ఉండేవి. 2019లో పునర్విభజనలో భాగంగా వీటిని ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో చేర్చారు. పట్టణ పరిధిలోని పింఛన్‌దారులకు పింఛన్‌ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. గ్రామీ ణ ప్రాంత లబ్ధిదారులకు మాత్రం పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు.
అయితే ఈ కాలనీలు ము న్సిపల్‌లో విలీనమై ఆరేళ్లవుతున్నా వీరికి మాత్రం దస్నాపూర్, మావలలోని పోస్టాఫీసుల ద్వారానే పింఛన్ చెల్లిస్తూ వస్తున్నారు. ఈ నగదు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఆయా కాలనీల నుంచి ప్రతి నెలా అక్కడికి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. అలాగే రద్దీ ఉండటంతో గంటల తరబడి నిరీక్షణ తప్పని పరిస్థితి. ఈ క్రమంలో వారి ఇక్కట్లను గుర్తించిన కలెక్టర్ వారికిచ్చే పింఛన్‌ను మున్సిపల్ ద్వారానే చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వచ్చే నెల నుంచి ఆయా కాలనీల్లోని 1608 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ కానున్నాయి.
మరి ఆ రెండు కాలనీల పరిస్థితి..
ఇదిలా ఉంటే ఆదిలాబాద్ రూరల్ మండల పరి ధిలో గ్రామ పంచాయతీగా ఉన్న అనుకుంట గ్రా మాన్ని మున్సిపల్ 4వార్డులో అలాగే రాంపూర్ గ్రామాన్ని 17వ వార్డులో విలీనం చేశారు. ప్రస్తుతం రాంపూర్‌లో 320 మంది, అనుకుంటలో 235 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. నిబంధనల ప్రకా రం వీరికి కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా 13 కాలనీల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించాలని నిర్ణయించిన అధికారులు ఈ రెండు కాలనీలను మాత్రం ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వారికి స్థానికంగానే పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నందున ప్రస్తుతం అక్కడ అమలు చేయడంలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటిని కూడా పట్టణ పరిధిలోకి తీసుకొస్తామని పేర్కొంటున్నారు.
మున్సిపల్ పరిధిలోకి చేరిన
లబ్ధిదారుల వివరాలు..
కాలనీ లబ్ధిదారుల సంఖ్య
దస్నాపూర్ 305
దోబీకాలనీ 104
దుర్గానగర్ 64
హన్‌మాన్‌నగర్ 58
న్యూహౌసింగ్‌బోర్డు 82
కై లాస్‌నగర్ 50
పిట్టలవాడ 187
రాంనగర్ 320
షాద్‌నగర్ 27
సుభాష్‌నగర్ 151
టైలర్స్‌కాలనీ 50
టీచర్స్‌కాలనీ 58
కేఆర్‌కే కాలనీ 142
ఈకేవైసీ నమోదు చేసుకోవాలి
పట్టణ పరిధిలోని 13 కాలనీల పింఛన్‌దారులకు ఇచ్చే సొమ్మును ఇక నుంచి నేరుగా మున్సిపల్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నాం. ఇందుకోసం లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ (ఈకేవైసీ) చేయించుకోవాలి. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుతో కూడిన వివరాలను ఈ నెల 25లోపు మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. జాప్యం చేస్తే పింఛన్ జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
– రాథోడ్ రవీందర్, డీఆర్‌డీఓ

ఇక వారి పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలకే.