breaking news
world league final
-
భారత్ పరాజయం
రాయ్‌పూర్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. పూల్ ‘బి’లో భాగంగా అర్జెంటీనాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అర్జెంటీనా తరఫున గొంజాలో పిలాట్ (3వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జోకిన్ మెనిని (24వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అర్జెంటీనా ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఆటతీరులో సమన్వయలేమి స్పష్టంగా కనిపించింది. అర్జెంటీనా ఏకంగా తొమ్మిది పెనాల్టీ కార్నర్లు సంపాదించి వాటిలో మూడింటిని గోల్స్‌గా మలచగా... భారత్‌కు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్ వృథా అయింది. శనివారం జరిగే మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. -
సువర్ణావకాశం
ఒకప్పుడు ప్రపంచ హాకీని శాసించిన భారత్ నేడు తమ ఉనికి కోసం పోరాడుతోంది. మార్కెటింగ్‌కు మంచి అవకాశాలున్న భారత్‌లో హాకీకి ఆదరణ తగ్గడం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)లో ఆందోళన కలిగించింది. భారత హాకీకి పునర్ వైభవం లభిస్తే అంతర్జాతీయంగానూ ఈ క్రీడ లాభపడుతుందని ఎఫ్ఐహెచ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు సాధ్యమైనన్ని టోర్నమెంట్లు కేటాయిస్తోంది. అందులో భాగంగానే ఈనెల 10 నుంచి 18 వరకు జరిగే వరల్డ్ లీగ్ ఫైనల్‌కు న్యూఢిల్లీ వేదికగా నిలుస్తోంది. ప్రపంచ హాకీలోని అగ్రశ్రేణి జట్లు బరిలో ఉన్న ఈ మెగా ఈవెంట్లో భారత్ కనీసం టాప్-3లో నిలిస్తే జాతీయ క్రీడకు కొత్త ఊపిరి లభించే అవకాశముంటుంది. సాక్షి క్రీడావిభాగం సొంతగడ్డపై ఇటీవల జరిగిన జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్ పదో స్థానంలో నిలిచింది. భారత హాకీ ప్రస్తుత స్థితి ఎలా ఉందో ఈ ఫలితమే సూచిస్తోంది. విదేశీ కోచ్‌లు మారుతున్నా... భారత జట్టు ప్రదర్శన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఆసియా స్థాయిలో అడపాదడపా మెరుపులు కనిపిస్తున్నా.. గత మూడు దశాబ్దాల కాలంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప టైటిల్స్ సాధించలేకపోయింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం... 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం.. ఆ తర్వాత భారత ఖాతాలో గొప్ప విజయాలు లేవనే చెప్పాలి. ఒలింపిక్స్ హాకీలో ఏ జట్టూ గెలవని విధంగా భారత జట్టు ఎనిమిది స్వర్ణాలు గెలిచింది. కాలక్రమేణా హాకీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సిద్ధం కాకపోవడం... ఇతరత్రా కారణాలు భారత హాకీని వెనక్కి నెట్టేశాయి. యూరోప్ జట్ల ఆధిపత్యం పెరిగిపోయినా... ఆర్థిక వనరులు అధికంగా ఉన్న భారత్‌లో ఈ ఆట ఉనికి ప్రశ్నార్థకం కావడం అంతర్జాతీయ హాకీ సమాఖ్యను ఆందోళనకు గురిచేసింది. భారత్‌లో ఈ క్రీడ మళ్లీ పూర్వ వైభవం పొందితే ఆర్థికంగా అంతర్జాతీయ హాకీకి మేలు జరుగుతుందని ఎఫ్ఐహెచ్ భావించింది. అందులో భాగంగా భారత హాకీ పురోభివృద్ధి కోసం మెగా ఈవెంట్స్ నిర్వహణ ఇచ్చింది. 2010లో ప్రపంచ కప్... ప్రస్తుతం వరల్డ్ లీగ్ ఫైనల్స్... ఈ ఏడాది చివర్లో భువనేశ్వర్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఈ ప్రణాళికలో భాగమే. ఫలితాలు వస్తేనే... నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్... గత నెలలో జరిగిన జూనియర్ ప్రపంచ కప్ తర్వాత భారత్‌లో జరుగుతోన్న మరో మెగా ఈవెంట్ ఇదే కావడం విశేషం. కానీ ఈ రెండు ఈవెంట్స్‌లో భారత్ నిరాశపరిచింది. మరో మూడు రోజుల్లో మొదలయ్యే వరల్డ్ లీగ్ ఫైనల్స్‌లో భారత్ రాణిస్తే భవిష్యత్‌కు భరోసా కలుగుతుంది. విదేశీ కొత్త కోచ్ టెర్రీ వాల్ష్కు ఇది తొలి పరీక్ష. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. తొలుత రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత లీగ్ దశ మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా అన్ని జట్లు క్వార్టర్ ఫైనల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడుతాయి. క్వార్టర్ ఫైనల్ విజేతలు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఏమిటీ వరల్డ్ లీగ్... ఒలింపిక్స్, ప్రపంచ కప్ అర్హత టోర్నీలకు ప్రత్యామ్నాయమే వరల్డ్ లీగ్. రెండేళ్లపాటు కొనసాగే ఈ వరల్డ్ లీగ్‌లో నాలుగు రౌండ్లు ఉంటాయి. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత మొదలైన ఈ వరల్డ్ లీగ్ న్యూఢిల్లీలోని ఫైనల్స్‌తో ముగుస్తుంది. ఎఫ్‌ఐహెచ్‌కు అనుబంధంగా ఉన్న అన్ని జట్లు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు అర్హులు. తొలి రౌండ్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17 అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న జట్లు బరిలోకి దిగుతాయి. ఈ రౌండ్ ద్వారా 16 జట్లు రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఈ రెండో రౌండ్లో 16 జట్లతో 9 నుంచి 16 ర్యాంక్‌లోపు ఉన్న ఎనిమిది జట్లు కలుస్తాయి. రెండో రౌండ్లో మొత్తం 24 జట్లు ఉంటాయి. ఈ జట్ల మధ్య మూడు టోర్నీలు జరుగుతాయి. ఇందులో నుంచి టాప్ 8 జట్లు సెమీఫైనల్స్‌గా పరిగణించే మూడో రౌండ్‌కు అర్హత పొందుతాయి. సెమీఫైనల్స్‌లో మొత్తం 16 జట్లు ఉంటాయి. ఈ జట్ల మధ్య రెండు టోర్నీలు జరుగుతాయి. ఈ సెమీఫైనల్స్ నుంచి టాప్-8 దేశాల నాలుగో రౌండ్ అయిన ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. తొలి దశ వరల్డ్ లీగ్ నుంచి ఆరు జట్లు (బెల్జియం, న్యూజిలాండ్, భారత్, స్పెయిన్, మలేసియా, ఇంగ్లండ్) ఈ ఏడాది జూన్‌లో నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. 2014 చివర్లో మొదలై 2016లో ముగిసే రెండో దశ వరల్డ్ లీగ్ నుంచి ఆరు లేదా ఏడు జట్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. భారత జట్టు: సర్దార్ సింగ్ (కెప్టెన్), శ్రీజేష్ (గోల్ కీపర్), పోతునూరి తిరుమలరావు (గోల్ కీపర్), రూపిందర్ పాల్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, గుర్మెయిల్ సింగ్, రఘునాథ్, ఎస్కే ఉతప్ప, నితిన్ తిమ్మయ్య, హర్బీర్ సంధూ, ఎస్వీ సునీల్, ఎంబీ అయ్యప్ప, బీరేంద్ర లాక్రా, చింగ్లెన్సనా, చందందా తిమ్మయ్య.