మహిళలకు భరోసా
విజయనగరం టౌన్: ఉపాధి కోర్సులపై మహిళలు మంచి ఆసక్తి కనబరుస్తున్నారు. స్వయం ఉపాధి మెండుగా ఉన్న రంగాలపై వారు ఇష్టం చూపుతున్నారు. కుట్లు, అల్లికలు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు, మెహందీ, శారీ పెయింటింగ్, తదితర కోర్సులను నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే వేలకు వేలు డబ్బులు పెట్టి బయట ఇనిస్టిట్యూట్లలో నేర్చుకుంటున్నా పూర్తిస్థాయిలో వారికి అవగాహన కలగడం లేదు. దీనికి తోడు ప్రైవేటు సంస్థలిచ్చే సర్టిఫికెట్లతో వారికి రుణాలు కూడా రావడం లేదు. దీంతో పారిశ్రామిక శిక్షణా సంస్థ అందించే ఉచిత శిక్షణలను వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు.
విజయనగరంలోని వీటీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో కుట్లు, అల్లికలకు సంబంధించి ప్రత్యేక ట్రేడ్ ఉంది. ఇక్కడ శిక్షణా కాలంలో విద్యార్థినులకు కుట్లు, అల్లికలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తదితర వాటిలో నిష్ణాతులు చేసి ఏడాది పొడవునా శిక్షణ ఇస్తారు. అనంతరం ప్రభుత్వం రూపొందించిన ఐటీఐ సర్టిఫికేట్‌ను అందజేస్తారు. దీంతో పాటూ పరిసర ప్రాంతాల్లో పలు సంస్థల్లో అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతో ఈ శిక్షణపై మగువలు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొందిన వారిలో అనేక మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారని ఐటీఐ డ్రెస్ మేకింగ్ ఫ్యాకల్టీ కోమలి తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో ప్రస్తుతం దరఖాస్తులు అందజేస్తున్నారని, అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కుట్టు మిషన్లు, మహిళలకు సంబంధించి అన్ని రకాల వస్త్రాల కుట్లు, అల్లికలుతో పాటూ ప్రత్యేకంగా కుందన్ డిజైనింగ్, వర్క్ శారీ, పెయింటింగ్ శారీ, డిజైనింగ్ శారీస్, బేబీ సూట్స్, ఎంబ్రాయిడరీ, ఆర్యావర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీలో వెరైటీస్, బేబీ ప్రాక్స్, పుల్, అంబ్రెళ్లా ప్రాక్స్, పార్టీ వేర్, బ్లౌజ్లో నెక్, రౌండ్, కటోరా కటింగ్ వంటి వాటిని ఇక్కడ నేర్పిస్తున్నారు.
దీనికి తోడు సంస్థ అందించే సర్టిఫికెట్లతో రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో డ్రస్ మేకింగ్ ట్రేడ్‌లో 20 సీట్లు, భద్రగిరి ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్నాయని కోమలి తెలిపారు. 16 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకూ విద్యార్థినులు, మహిళలు ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలన్నారు. కుట్లు, అల్లికలకు సంబంధించి ఏడాదిలో ప్రతీ ఆరు నెలలకు రెండు సెమిస్టర్ విధానంలో పరీక్ష ఉంటుందని, సబ్జెక్ట్‌కి సంబంధించిన చిన్న ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుందన్నారు. ప్రస్తు తం దరఖాస్తులను కార్యాలయంలో రూ.10 ప్రభుత్వ రుసుం చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు.