breaking news
Water agreements
-
నన్నెవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు నేను అనుకున్నవన్నీ జరిగాయి. లక్ష్యశుద్ధి.. చిత్తశుద్ధి.. వాక్శుద్ధి ఉంటే.. ఏదైనా కచ్చితంగా అయి తీరుతుంది’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌తో కలసి రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం ప్రారంభించారు. కలెక్టరేట్లో కేసీఆర్ సుదీర్ఘంగా (గంటసేపు) మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఏం సాధించామో అందరి కళ్లముందే కనిపిస్తోందని తెలిపారు. రాజకీయాల్లో కిరికిరిగాళ్లు ఎప్పుడూ ఉంటారని, సన్నాసులు ఎప్పుడూ సన్నాసులేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక పాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, కొత్త కలెక్టరేట్ నమూనాలను ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి, ఇంజినీర్ గణపతిరెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. రైతుల ఇళ్లలో బంగారు వాసాలు కావాలే గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెడితే అది అయితదా.. పోతదా.. అని అనుమానపడ్డారని, ఏం జరిగిందో కళ్లముందే ఉందని కేసీఆర్ అన్నారు. మల్టీ స్టేజీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తాను చెబితే కొందరు అపవాదులు వేశారని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీతోనే పంచాయితీ పెట్టుకున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకే 40 లక్షల ఎకరాలు పారుతోందని స్పష్టం చేశారు. ఎంతో శ్రమించి కాళేశ్వరం కడితే.. కరెంట్ ఖర్చు రూ.10వేల కోట్లు అంటూ.. కొందరు మాట్లాడుతున్నారని, రైతుల బాగుకోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఇళ్లలో బంగారువాసాలు కావాలన్నారు. చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చు... ఆరేళ్లలో ఎంతో అద్భుతం జరిగిందని, వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఇంకా మధ్యలో చిన్నచిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఇప్పుడు రిజర్వాయర్‌గా మారిందని, 365 రోజులు చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చన్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ ప్రాజెక్టులతో 180 కిలోమీటర్లు గోదావరి సజీవ జలదృశ్యం ఆవిష్కృతమైందని స్పష్టం చేశారు. గతంలో వర్షాలు పడితే.. చెరువులు తెగిపోయేవని, ప్రస్తుత ప్రభుత్వం చెరువులను బాగు చేయడంతో అధిక వర్షాలు పడినా చెరువులు మంచిగా ఉన్నాయన్నారు. బతుకమ్మ చీరలపైనా రాజకీయం.. ఒకప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దు.. అనే నినాదాలు గోడలపై కనిపించాయని, అవి తనను ఎంతో కలిచివేశాయన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల తయారీ ఇస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. సిరిసిల్లలో పద్మశాలి భవన్ కు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పల్లె, పట్టణ ప్రగతిని బాగా చేయండి ‘మీకు దండం పెడతా.. పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతిని పకడ్బందీగా చేయండి’ అంటూ సీఎం కోరారు. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. హరితహారం ఉజ్వలమైన కార్యక్రమం అని.. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్‌లో మన పిల్లలకు ఇచ్చే సంపద ప్రకృతి మాత్రమేనని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. అయినా ఒక్కో పనిని చేసుకుంటూ పోతున్నామని, దుబారా లేకుండా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రఘోత్తమరెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థుల స్టై ఫండ్ పెంపు.. మొదటి సంవత్సవం వారికి ప్రస్తుతం రూ.1500 స్టైఫండ్ ఇస్తున్నారు.. దాన్ని రూ.5 వేలకు పెంచుతున్నం. రెండో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1600 స్థానంలో రూ.6వేలు, మూడో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1900 స్థానంలో రూ.7వేలు ఇస్తం. గర్వంగా చెబుతున్నా... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉంది. ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు ఉన్నాయని నేను గర్వంగా చెబుతున్నా. రూ.10వేల కోట్లు... రూ.10వేల కోట్లతో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నం. రెండో విడత గొర్రెల పంపిణీని రూ.4వేల కోట్లతో చేపడతం. -
వాటిపై మాకు ప్రత్యేక హక్కులున్నాయి : పాక్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌కు వెళ్లే నదుల నీటిని భారత్‌కు మళ్లిస్తామని హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ స్పందించారు. గురువారం ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆయన.. హిమాలయాలకు పశ్చిమంగా ప్రవహించే మూడు నదులపై పాకిస్తాన్‌కు ప్రత్యేక హక్కులున్నాయని పేర్కొన్నారు. మోదీ చెప్పినట్టు భారత్ కనుక అలాంటి చర్యలకు పాల్పడితే అది ఒప్పంద ఉల్లంఘనే అవుతుందని అంతేకాక, దూకుడు చర్యగా కూడా పరిగణింపబడుతుందని తెలిపారు. ఈ విషయంపై స్పందించే హక్కు పాక్‌కు ఉందని వెల్లడించారు. భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదనే అనుకుంటున్నానని తెలిపారు. కాగా, ఇరు దేశాల మధ్య నదుల నీటి విషయంలో సింధూ జలాల ఒప్పందం ఉంది. దాని ప్రకారం బియాస్, రావీ, సట్లెజ్ నదులను భారత్‌కు, సింధూ, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్‌కు చెందాయి. ఇరు దేశాలు ఎంత నీటిని వాడుకోవాలనేది ఉమ్మడిగా నిర్ణయించారు. అయితే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం కారణంగా భారత్ తన వాటాను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతోంది. ఆ నీళ్లతో పాకిస్థాన్ అదనపు లబ్ది పొందుతోంది. అయితే నీళ్లను అడ్డుపెట్టుకొని భారత్ తమతో ఐదో జనరేషన్ యుద్ధం చేస్తోందని పాక్ గతంలో ఆరోపణలు చేసింది. ఒక సందర్భంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. భారత్ తన వాటాను వాడుకోవడం వల్ల సింధూ ఒప్పందానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. -
కర్ణాటక జల దోపిడీని అడ్డుకుందాం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఎగువనున్న కర్ణాటక రాష్ట్రం నీటి ఒప్పందాలు, ట్రిబ్యునల్ తీర్పును అపహాస్యం చేసే రీతిలో వ్యవహరిస్తోందని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇష్టారీతిన బ్యారేజీలు కడుతూ దిగువ పరీవాహకానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటూ జల దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించింది. తాజాగా కృష్ణా-భీమా నదుల సంగమానికి ఎగువన రాష్ట్ర సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక మరో బ్యారేజీ నిర్మాణాన్ని చేపడుతోందని, దీని ద్వారా సమీపంలో నిర్మిస్తున్న భారీ విద్యుదుత్పత్తి కేంద్రాలకు నీటిని సరఫరా చేసే యోచనలో ఉందని నీటిపారుదల శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖలోని అంతరాష్ట్ర నదీ వివాదాల విభాగం అధికారులు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇతర ప్రభుత్వ పెద్దలకు మంగళవారం లేఖలు రాసినట్లు తెలిసింది. కర్ణాటక బ్యారేజీ కడుతున్న ప్రాంతంలో ఇటీవలే రహస్యంగా పర్యటించిన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు సమర్పించిన పలు డాక్యుమెంట్లు, నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను లేఖతోపాటు పంపినట్లుగా సమాచారం. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేలా ఆ ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరపాలని లేనిపక్షంలో కేంద్ర జల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేసి తగిన చర్యల కోసం విన్నవించాలని నీటిపారుదల శాఖ కోరింది.