breaking news
Triple murders
-
హైవే కాల్పులు: పోలీసుల అదుపులో సీఐ
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్స్ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మరో ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు పెదవి విప్పటం లేదు. మరోవైపు నిందితులను రక్షించేందుకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ నెల 24న కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మారం శ్రీనివాస్, గణేష్ సహా స్థానికులు ఆరుగురు నిందితులుగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా వీరిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు వీలైనంత త్వరలో పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోతారని, అప్పటివరకు వారిని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టొద్దని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు కమిషనరేట్ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను అధికారులు సున్నితంగా తిరస్కరించారని సమాచారం. -
'అప్పు చెల్లించలేదన్న అక్కసుతోనే హత్యలు'
విశాఖ : కేవలం అప్పు చెల్లించలేదన్న అక్కసుతోనే మేనమామ తమపై హత్యాయత్నం చేశాడని ప్రాణాలతో బయటపడ్డ మంత్రి గణేష్ తెలిపారు. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాఖ శివారు పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణహత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఈ దారుణ కాండలో తండ్రి, తాతయ్య, నానమ్మలను కోల్పోయిన విషయాన్ని పోలీసులు గణేష్‌కు తెలియనివ్వలేదు. ఇంటర్ చదువుతున్న గణేష్ తన మేనమామ అసిరి నాయుడు మొదటి నుంచి మూర్ఖంగా ప్రవర్తించేవాడిని తెలిపాడు. దీపావళి రోజున తనను సరదాగా ఆటాడుకుందామంటూ రెండుకాళ్ళను తాళ్లతో బంధించి, ముఖానికి కవర్‌తో ముసుగు తొడిగి రాడ్‌తో దాడి చేసినట్లు చెప్పాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న తాను బంధువుల సాయంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాడు. వివరాల్లోకి వెళితే రాజమండ్రి సమీపంలోని ద్వారపూడి అన్నదేవరపేటకు చెందిన మంత్రి సన్యాసిరావు(70), ఎల్లమ్మ(65) దంపతులతో పాటు కుమారుడు మంత్రి సాంబ(37) ఎనిమిదేళ్ల క్రితం చినముషిడివాడలోని క్రాంతినగర్‌కు వలస వచ్చారు. సన్యాసిరావు, ఎల్లమ్మ దంపతుల అల్లుడు పల్లాడ అసిరినాయుడు వీరికి రూ.50వేలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలంగా బాకీ విషయంలో, అలాగే అన్నదేవరపేటలోని ఆస్తిపై వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సన్యాసిరావు కుటుంబ సభ్యులతో అసిరినాయుడు వివాదానికి దిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ ముగ్గురిపై ఇనపరాడ్డుతో దాడికి దిగడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను ఇంటి పడక గదిలో గుట్టగా పడేసి ఏమీ తెలియనట్టు ఉన్నాడు. మధ్యాహ్నం సాంబ కుమారుడు గణేష్ కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. అసిరినాయుడే అతడికి భోజనం పెట్టాడు. కాసేపటి తరువాత దొంగ, పోలీస్ ఆట ఆడుకుందాం అంటూ చేతులు వెనక్కికట్టి గోనెసంచిలో పెట్టి మూశాడు. అనంతరం ఇనుపరాడ్డుతో దాడికి దిగడంతో భీతిల్లిన గణేష్ అక్కడ నుంచి తప్పించుకుని బయటకు పరుగు తీశాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరాడు. కాగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.