రేసు గుర్రాలు చిన్న షేర్లు
స్వల్ప వెనకడుగు తరువాత మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. మోడీ మంత్రివర్గంపై అంచనాలతో బుధవారంనాటి నష్టాలకు విరుద్ధంగా సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. మిడ్ సెషన్‌కల్లా 226 పాయింట్లకుపైగా ఎగసి 24,500ను అధిగమించింది. చివర్లో లాభాల స్వీకరణకు అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 76 పాయింట్ల లాభాన్ని మిగిల్చుకుని 24,374 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 7,276 వద్ద నిలిచింది. నిఫ్టీకిది కొత్త గరిష్ట స్థాయి ముగింపు! కాగా, ఇటీవల రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్న చిన్న, మధ్య తరహా షేర్లు మరోసారి దూకుడు ప్రదర్శించాయి. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2.2% చొప్పున ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 2,069 పురోగమిస్తే, కేవలం 774 నష్టపోయాయి.
పసిడి షేర్ల మెరుపులు
రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించడంతో జ్యువెలరీ షేర్లు లాభాలతో మెరిశాయి. టీబీజెడ్, పీసీ జ్యువెలర్స్ 20% చొప్పున దూసుకెళ్లగా, గీతాంజలి జెమ్స్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, టైటన్, గణేశ్ జ్యువెలర్స్ 12-5% మధ్య జంప్ చేశాయి. వీటితోపాటు బ జాజ్ ఎలక్ట్రికల్స్, వీడియోకాన్, విర్ల్‌పూల్ 11-6% మధ్య పురోగమించడంతో వినియోగ వస్తురంగం 7% ఎగసింది. ఈ బాటలో రియల్టీ 5.5% పుంజుకోగా, పవర్, మెటల్స్ 2% స్థాయిలో లాభపడ్డాయి.
రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, యూనిటెక్, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, డీబీ 10-4% మధ్య పుంజుకున్నాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో ఎంసీఎక్స్, గుజరాత్ ఆల్కలీస్, సుజ్లాన్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, ఎన్‌హెచ్‌పీసీ, లవబుల్ లింగరీ, బాంబే డయింగ్, త్రివేణీ టర్బయిన్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ 20-11% మధ్య ఎగశాయి. మరోవైపు సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, మారుతీ, సెసాస్టెరిలైట్, టాటా పవర్, ఆర్ఐఎల్, ఎస్బీఐ 5-2% మధ్య పురోగమించగా, హిందాల్కో, భెల్, భారతీ, హెచ్డీఎఫ్సీ, విప్రో 3-2% మధ్య నష్టపోయాయి.