breaking news
Satisbabu
-
నాడు తండ్రి..నేడు తనయుడు
పార్లమెంటరీ కార్యదర్శిగా సతీష్‌బాబు సహాయ మంత్రి హోదా విద్యాశాఖ అప్పగింత కరీంనగర్ సిటీ/హుస్నాబాద్ : హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో టీఆర్ఎస్కు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఈటెల రాజేందర్, కేటీఆర్‌లకు కేబినెట్ పదవులు లభించాయి. మరో సీనియర్ నేత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను ఇటీవలనే చీఫ్‌విప్ పదవి వరించింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి దక్కింది. మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలను ఇతర పదవుల్లో భర్తీ చేయాలనే కేసీఆర్ ఆలోచన మేరకు సతీష్‌బాబుకు పార్లమెంటరీ కార్యదర్శి వచ్చింది. సతీష్‌బాబు తండ్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో కేబినెట్ కూర్పు సమయంలోనే సతీష్‌కు మంత్రి పదవి లభిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అప్పుడు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తర్వాత కేబినెట్ విస్తరణలో బెర్త్ ఖాయమని భావించినప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలోనే సహాయ మంత్రి హోదా గల పార్లమెంటరీ కార్యదర్శి పదవిని అప్పగించారు. విద్యాశాఖ కేటాయింపు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమిస్తూ సతీష్‌బాబుకు విద్యాశాఖను కేటాయించారు. ఆయన సహాయ మంత్రి హోదాలో పనిచేస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాటు ఆ శాఖ బాధ్యతలను సతీష్‌బాబు నిర్వర్తిస్తారు. ఇప్పటివరకు జిల్లాలో ముగ్గురు విద్యాశాఖ, అనుబంధ శాఖల మంత్రులుగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో పాటి రాజం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబునాయుడు హయాంలో ముద్దసాని దామోదర్‌రెడ్డి, వైఎస్సార్ హయాంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సాంకేతిక విద్యాశాఖ మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాకు సంబంధించి సతీష్‌బాబు నాలుగో విద్యాశాఖ మంత్రి. నాణ్యమైన విద్యనందించేందుకు కృషి రాష్ట్రంలో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తానని పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాశాఖను కేటాయించడం ఆనందంగా ఉందని, ఈ విభాగంపై తనకు అనుభవం ఉందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్ : రాజకీయంగా వెనకబాటుకు గురైన హుస్నాబాద్‌కు పార్లమెంటరీ కార్యదర్శి రూపంలో సహాయమంత్రి హోదా లభించింది. రాజకీయ నేపథ్యం కలిగిన వొడితెల కుటుంబం నుంచి ఒకప్పుడు లక్ష్మీకాంతరావు మంత్రిగా పనిచేయగా ఇప్పుడు ఆయన తనయుడు సతీశ్‌కుమార్‌ను పార్లమెంటరీ సెక్రటరీ పదవి వరించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వంలోనే సహాయమంత్రి హోదా దక్కించుకున్నారు. లక్ష్మీకాంతరావు ప్రస్తుతం టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులుగా కొనసాగుతుండగా ఆయన భార్య సరోజనీదేవి హుజూరాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్నారు. విద్యాసంస్థల అధినేతగా అనుభవమున్న సతీశ్‌ను విద్యాశాఖ మంత్రికి అనుబంధంగా నియమించడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రాబల్యం కలిగిన ఈ నియోజకవర్గం నుంచి చాలా సార్లు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనే ఉండేవారు. ఇది అభివృద్ధిపై ప్రభావం చూపగా... ఇప్పుడు సహాయమంత్రి హోదా దక్కడం నియోజకవర్గ ప్రగతికి తోడ్పడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాడు దేవిశెట్టి.. నేడు సతీశ్‌కుమార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇందుర్తి నియోజకవర్గంలో ముఖ్యనేతగా ఉన్న దేవిశెట్టి శ్రీనివాస్‌రావు ఆప్కాబ్ చైర్మన్‌గా ఎన్నికై సహాయమంత్రి హోదా దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గమే హుస్నాబాద్ నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత వొడితెల సతీశ్‌కుమార్‌కు కూడా సహాయమంత్రి హోదా లభించడం విశేషం. సతీశ్‌కుమార్ రాజకీయ నేపథ్యం 1995: హుజూరాబాద్ మండలం సింగాపురం సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నిక 2001 : టీఆర్ఎస్లో చేరిక 2002 : హుజూరాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక 2005 : తుమ్మనపల్లి సింగిల్‌విండో అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2006, 2011 : వరంగల్ అర్బన్ సహకార బ్యాంకు డెరైక్టర్‌గా ఏకగ్రీవ ఎన్నిక 2012 : హుస్నాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జీగా నియామకం 2014 : హుస్నాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక 2014 : పార్లమెంటరీ కార్యదర్శిగా నియామకం -
వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
ముదినేపల్లి : మండలంలోని బొమ్మినంపాడు పాత దళితవాడలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ కన్వీనర్ దాసి రంగారావుపై మంగళవారం హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవగా, ప్రాణాపాయ స్థితిలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతనెల 31న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేసిన నేతల రూపకు రంగారావు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో రూప గెలుపొందారు. ప్రత్యర్థి వర్గం నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక రంగారావుపై కక్ష పెంచుకున్నారు. తమ అభ్యర్థి ఓటమికి ఆయనే ప్రధాన కారకుడిగా భావించారు. ఈ నేపథ్యంలో రంగారావు మంగళవారం పొలంలో పురుగుల మందు చల్లి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రత్యర్థి వర్గానికి చెందిన పంతగాని సతీష్‌బాబు గడ్డపలుగుతో దాడి చేశాడు. ఈ ఘటనలో రంగారావు తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగారావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె.ఈశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్యాయత్నానికి పాల్పడ్డ సతీష్ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. దాడి హేయం... రంగారావుపై హత్యాయత్నాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తదూలం నాగేశ్వరరావు, మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు తీవ్రంగా ఖండించారు. ముదినేపల్లిలో వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటన హేయమైనదిగా అభివర్ణించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కక్షలు పెంచుకుని దాడులు చేయడం తగదని హితవు పలికారు. రంగారావుపై హత్యాయత్నాన్ని పార్టీకి చెందిన వివిధ విభాగాల కన్వీనర్లు తీవ్రంగా ఖండించారు.