breaking news
sanga reddy rural
-
నవల్గాలో మద్యం నిషేధం!
సాక్షి, బషీరాబాద్(సంగారెడ్డి): యువతను పెడదారి పట్టిస్తున్న మద్యంను కట్టడి చేయడానికి బషీరాబాద్ మండలం నవల్గా గ్రామ పంచాయతీ నడుం బిగించింది. గ్రామంలో నడుపుతున్న బెల్టు షాపుల భరతం పట్టాలని నిర్ణయించింది. దీని కోసం సర్పంచ్ డి. నర్సింహులు బుధవారం పంచాయతీ కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. జులై ఒకటి నుంచి గ్రామంలోని మద్యపానం నిషేధిస్తూ పంచాయతీ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇకపై బెల్టు షాపులన్నీ మూసి వేయాలని నోటీసులు జారీకి రంగం సిద్ధం చేశారు. జులై ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నందున ఇకపై బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ అధికారులకు సర్పంచ్ లేఖ రాశారు. బషీరాబాద్ మండలం నవల్గా మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ యువత, కార్మికులు ఎక్కువగా ఉంటారు. అయితే సాయంత్రం అయితే చాలు మద్యం ప్రియులు మద్యం తాగి రోడ్లమీద హల్చల్ చేస్తున్నారు. మద్యం మత్తులో తరుచూ గొడవలు జరుగుతుండటమే కాకుండా న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదే విషయమై గ్రామ సర్పంచ్ పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. అయితే గ్రామంలో జరుగుతున్న గొడవలకు ప్రధాన కారణం బెల్టు షాపులని భావించిన సర్పంచ్ డి.నర్సింహులు మద్యం బంద్ చేస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తూ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల వలన యువత పెడదారి పడుతున్నారని అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారన్నారు. అలాగే గని కార్మికులు కూడా ఎక్కువగా ఉండడంతో మద్యానికి బానిసై కాపురాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటిని పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో బెల్టు షాపులు పూర్తిగా బంద్ చేయాలని ఆబ్కారీ శాఖ అధికారులకు కూ డా లేఖ రాసినట్లు సర్పంచ్ వెల్లడించారు. లేఖ మరోవైపు సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని మహిళలు, విద్యావంతులు, విద్యార్థులు స్వాగతించారు. సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి ఆయన్ని అభినందనలు తెలిపారు.. అలాగే గ్రామంలో స్వచ్ఛతపై కూడగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సర్పంచ్ చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలక్రిష్ణ, ఉప సర్పంచ్ మాల లాలప్ప, కార్యదర్శి లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ్‌కుమార్, మహేష్, వార్డు సభ్యులు సిద్దయ్య, ఆనంద్, మొగులమ్మ, పార్వతమ్మ, మొగులమ్మ, రాములమ్మ, లక్ష్మీ, అంగన్వాడీ టీచరు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
ఆర్థిక లావాదేవీలే కారణం...? సంగారెడ్డి క్రైం / మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం అర్ధరాత్రి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సంకరి జనార్దనరెడ్డి (45) సోమవారం రాత్రి తన ఇంటిపైన పడుకునేందుకు వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు వర్షపు చినుకులు పడుతున్నాయని గుర్తించిన కుటుంబ సభ్యులు ఇంటిపై నిద్రిస్తున్న జనార్దనరెడ్డిని నిద్రలోంచి లేపేందుకు గాను ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పైకి వెళ్లి చూసే సరికి రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడని, అదే సమయంలో ప్రహరీ పైనుంచి గుర్తు తెలియని వ్యక్తులు పారిపోవడాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి దవడ కింద కత్తితో పొడవంతో రక్తపు మడుగులో పడిఉన్నాడు. ఇదిలా ఉంటే మృతుడు జనార ్దనరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టు పనులు చేసేవారని ఇందులో వచ్చే వాటాల కోసం నిలదీయడం వలనే ఈ సంఘటన చోటు చేసుకుందని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేష్‌తో పాటు సీఐ వెంకటేష్, ఎస్ఐ రాజశేఖర్‌లు సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.