breaking news
sandhyarani parents
-
ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలి: కేటీఆర్
హైదరాబాద్ : గుంటూరు వైద్య కళాశాలలో మెడికో సంధ్యారాణి ఆత్మహత్యకు కారకులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సంధ్యారాణి తల్లిదండ్రులు శనివారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ వారు .. కేటీఆర్‌ను కోరారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధించడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్యారాణి తన సూసైడ్ నోట్లో పేర్కొందని మంత్రికి సంధ్యారాణి కుటుంబీకులు వివరించారు. మరో రెండు నెలల్లో విద్య పూర్తి అయ్యేదని, అయితే ప్రొఫెసర్ వేధింపులకు ఇలా బలి అయిపోయిందని వాపోయారు. ఆమె కుటుంబానికి కేటీఆర్ సానుభూతి తెలుపుతూ వెంటనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రొఫెసర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం దారుణమంటూ ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకున్నా నిందితురాలికి శిక్ష పడాలని కోరారు. అలాగే ఏపీ డీజీపీ సాంబశివరావుతోనూ ఫోన్లో మాట్లాడి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితురాలిని వెతికి పట్టుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కాగా, ఈ విషయంలో మృతురాలి కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఈమేరకు ఏపీ వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చి వచ్చామని, దాన్ని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. లక్ష్మి భర్తను కూడా ఉద్యోగం నుంచి తప్పిస్తామన్నారు. అవసరమైతే ఏపీ సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడతారని సంధ్యారాణి కుటుంబానికి కేటీఆర్ హామీ ఇచ్చారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన సంధ్యారాణి పేరెంట్స్
హైదరాబాద్ : వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో విద్యార్థిని సంధ్యారాణి తల్లిదండ్రులు శనివారం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తన కుమార్తె చావుకు కారణం అయిన ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను కోల్పోయిన తమకు న్యాయం చేయాలని సంధ్యారాణి తల్లిదండ్రులు కోరారు. వైఎస్ఆర్ సీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా గుంటూరు జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డా.లక్ష్మి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. మరోవైపు రాజకీయ జోక్యంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని సంధ్యారాణి సూసైడ్ నోట్ రాయగా, ఈ ఘటనపై ఏర్పాటు అయిన కమిటీ కూడా లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. అయినా లక్ష్మిని అరెస్టు చేయకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.