రూ.1,075 కోట్లు
                  
	- ఇన్పుట్ సబ్సిడీ నివేదిక సిద్ధం
	- దెబ్బతిన్న పంట ఉత్పత్తుల విలువ రూ.2,874 కోట్లు  
	- 7.22 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తుల నష్టం
	- కేంద్ర కరువు బృందానికి అధికారిక నివేదిక సమర్పణ
	
	జిల్లాలో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం            : 7,53,132 హెక్టార్లు
	దిగుబడి రాని పంట ఉత్పత్తులు            : 7.22 లక్షల మెట్రిక్ టన్నులు
	పంటల వారీగా నష్టం విలువ            : రూ.2,874.44 కోట్లు
	ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రతిపాదనలు            : 1,075.46 కోట్లు
	నష్టపోయిన రైతుల సంఖ్య                : 6,93,003 మంది
	అందులో చిన్నసన్నకారు రైతులు            : 5,71,244 మంది
	
	అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్-2016 పంట నష్టానికి సంబంధించి రూ.1,075 కోట్లతో  పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (కేంద్ర కరువు బృందం)కు సమర్పించారు. ‘అధికారిక’ నష్టమే ఈ స్థాయిలో ఉందంటే వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయనే విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
	
	పంట పెట్టుబడులు, దిగుబడులను పరిగణనలోకి తీసుకుంటే రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుఽ అంచనా. వేరుశనగ, కంది, పత్తి, ఆముదం.. ఇలా అన్ని రకాల పంటలు దారుణంగా దెబ్బతినడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నట్లు కరువు బృందానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వశాఖల నుంచి సమర్పించిన రూ.2,161.38 కోట్ల జిల్లా నివేదికలో సింహభాగం ఇన్పుట్ సబ్సిడీదే కావడం గమనార్హం. మిగతా అన్ని శాఖలకు సంబంధించి రూ.1,085.92 కోట్లు కావాలని కోరారు. మొత్తమ్మీద ఇన్పుట్ సబ్సిడీ నివేదికలో వేరుశనగ పంట నష్టం రూ.929.88 కోట్లుగా చూపించారు. మిగతా 15 పంటల నష్టం రూ.145.58 కోట్లుగా తేల్చారు. పంటల వారీగా స్కేల్‌ఆఫ్ రిలీఫ్ (నష్ట ఉపశమనం) ప్రకారం నష్టాన్ని అంచనా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
	
	పంటల వారీగా నష్టం వివరాలు
	––––––––––––––––––––––––––––––––––––––––––––
	పంట పేరు    దెబ్బతిన్న విస్తీర్ణం    పంట ఉత్పత్తి నష్టం    ఇన్పుట్ ప్రతిపాదన
	            (హెక్టార్లలో)        ( రూ.కోట్లలో)        ( రూ.కోట్లలో)
	––––––––––––––––––––––––––––––––––––––––––––––
	వేరుశనగ        6,19,925        2,061.00        929.88
	కంది        72,357            320.97            72.35
	ప్రత్తి        31,170            367.82            46.75
	ఆముదం        8,700            22.23            05.91
	మొక్కజొన్న    8,744            48.22            10.93
	జొన్న        4,044            03.99            02.75
	పొద్దుతిరుగుడు    2,309            11.02            02.30
	కొర్ర        2,082            01.34            01.04             
	మినుము        1,180            ––            01.18
	పెసర        977            ––            97.72 లక్షలు
	ఉలవ        155            ––            15.56  ,,
	రాగి        17            ––            01.16  ,,
	సోయాబీన్        582            ––            58.23  ,,
	సజ్జ        737            ––            50.18  ,,
	నువ్వులు        139            ––            09.50  ,,
	అలసంద        06            ––            0.63 వేలు
	––––––––––––––––––––––––––––––––––––––––––––––––
	16 పంటలు    7.53 లక్షల హెక్టార్లు    2,874.44 కోట్లు    1,075.46 కోట్లు
	––––––––––––––––––––––––––––––––––––––––––––––––