రికియార్డో సంచలనం
సెపాంగ్: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ల ఆధిపత్యానికి రెండోసారి రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు అడ్డుకట్ట వేశారు. మలేసియా గ్రాండ్‌ప్రిలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్డో ఈ సీజన్లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రికియార్డో సహచరుడు మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని దక్కించుకొని రెడ్‌బుల్ బృందం ఆనందాన్ని ‘డబుల్’ చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 16 రేసులు జరిగాయి. అందులో 14 రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లు (రోస్‌బర్గ్ 8, హామిల్టన్ 6) విజేతలుగా నిలిచారు. మిగతా రెండింటిలో రెడ్‌బుల్ డ్రైవర్లు (వెర్స్టాపెన్, రికియార్డో) టైటిల్స్ నెగ్గారు.
56 ల్యాప్‌ల మలేసియా గ్రాండ్‌ప్రి రేసును రికియార్డో గంటా 37 నిమిషాల 12.776 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. కెరీర్లో నాలుగో గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన రికియార్డోకిది 41 రేసుల తర్వాత తొలి విజయం కావడం గమనార్హం. 2014లో అతను మూడు టైటిల్స్ సాధించాడు. మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మూడో స్థానంలో నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్)ను దురదృష్టం వెంటాడింది. 40 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.
ప్రపంచ మాజీ చాంపియన్ వెటెల్ తొలి ల్యాప్‌లోనే రోస్‌బర్గ్ కారును ఢీకొట్టి వెనుదిరగ్గా... మరో నలుగురు డ్రైవర్లు కూడా ఇతర సమస్యలతో రేసు మధ్యలోనే తప్పుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మరో ఐదు రేసులు మిగిలిఉన్న ఈ సీజన్లో ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (288 పాయింట్లు), హామిల్టన్ (265 పాయింట్లు), రికియార్డో (204 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది.