breaking news
Repechage
-
బస్తీమే బాబా దంగల్ విత్ రెపెషాజ్
రామ్‌దేవ్ తెలిసిన మనిషే. హిందూ బాబా. మరి ఈ రెపెషాజ్ ఎవరు? ముస్లిం బాబానా? కాదు. రెపెషాజ్ అసలు మనిషే కాదు. అంటే.. రాక్షసుడు అని కాదు. రెపెషాజ్ అనేది ఇంగ్లిష్ మాట. స్పెల్లింగ్ వచ్చేసి repechage. దాటించడం అని అర్థం. గట్టెక్కించడం అని కూడా. కొన్ని ఆటల్లో రెపెషాజ్ ఉంటుంది. బాగా ఆడి కూడా గెలవలేకపోయిన ఆటగాడిని గట్టెక్కించడం కోసం ఫైనల్లో ఓ చాన్స్ ఇస్తారు. ఇంచుమించు అది ‘వైల్డ్‌కార్డ్ ఎంట్రీ’ లాంటిది. స్పెషల్‌గా సెలక్ట్ అయిపోవడం. రామ్‌దేవ్ బాబా.. ఇక్కడ రెజ్లింగ్‌లో తలపడుతున్నది ఆండ్రీ స్టాడ్నిక్తో. 2008 ఒలింపిక్స్‌లో స్టాడ్నిక్ సిల్వర్ మెడలిస్టు. ఆ మెడలిస్టు మెడలు వంచి 12–0 స్కోర్‌తో విన్ అయిపోయారు బాబా! పతంజలి పవరీటా ప్రో రెజ్లింగ్ లీగ్ (పి.డబ్లు్య.ఎల్) ప్రమోషనల్ బౌట్ (మ్యాచ్) ఇది. మొన్న బుధవారం న్యూఢిల్లీలో జరిగింది. బాబా మీద పోటీకి సాహసించిన ఆండ్రీ స్టాడ్నిక్ తక్కువవాడేమీ కాదు. బీజింగ్ ఒలింపిక్స్‌లో మన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను గిరగిర తిప్పి ఎత్తి పడేసినవాడు. ఆండ్రీది ఉక్రెయిన్. ఉక్రెయిన్ సుశీల్‌కు రెపెషాజ్ ఇవ్వడంతో అప్పట్లో అతడికి ఫైనల్లో ఆండ్రీతో పోటీ పడే అవకాశం వచ్చింది. కాంస్యమూ వచ్చింది. అంతటి ఆండ్రీని ఇప్పుడు రామ్‌దేవ్ బాబా తలకిందులుగా తిప్పి కుదేలు చేసేశాడు. 34 ఏళ్ల గండరగండడిని 51 ఏళ్ల రామ్‌దేవ్ బాబా ఎలా ఓడించాడబ్బా?! ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఓడిపోవడమే గెలుపు. అలా ఆండ్రీ గెలిచి, బాబాను గెలిపించారు. ఇదో రకం రెపెషాజ్. -
క్వార్టర్లో ఓడినా.. పతకం ఎలా దక్కిందో తెలుసా?
ఒలింపిక్స్‌లో మరోసారి భారత రెజ్లర్‌కు ‘రెప్‌చేజ్’ వరంగా మారింది. ఇప్పటికే బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్, లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్ 'రెప్‌చేజ్' ద్వారా కాంస్య పతకాలు సాధించగా.. ముచ్చటగా మూడోసారి తాజాగా రియోలోనూ సాక్షి మాలిక్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఫ్రెంచ్ పదం! 'రెప్‌చేజ్' అనేది ఫ్రెంచ్ పదం. దీని అర్థం 'రెండో అవకాశం' అని.. సాక్షికి ఫ్రెంచ్ తెలియదు. ఫ్రెంచ్ తెలుసుకోవాల్సిన అవసరమూ తనకు లేదు. కానీ ఉడుముపట్టు పట్టి ప్రత్యర్థులను చిత్తుచేయడమే తనకు తెలుసు. అందుకే రెజ్లింగ్‌లో ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి మహిళగా, రియో ఒలింపిక్స్ లో తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సాక్షి మాలిక్ క్వార్టర్ ఫైనల్లో రష్యాన్ రెజ్లర్ వలెరియా కొబ్లోవా చేతిలో ఓడిపోయింది. అయినా సాక్షి పతకం మీద ఆశల వదులుకోలేదు. అదృష్టం కలిసివచ్చి ఆమె మీద గెలిచిన వాలెరీ ఫైనల్‌కు వెళ్లింది. దీంతో 'రెప్‌చేజ్' అవకాశం సాక్షికి దక్కింది. దీంతో ఆకలిగొన్న పులిలా గర్జించిన సాక్షి.. అద్భుతమైన పట్టు పట్టి భారత్ ఎదురుచూపులకు తెరదించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై గెలిచి కాంస్యాన్ని సాధించింది. ఆరెంజ్ దుస్తులు ధరించి బౌట్‌లోకి అడుగుపెట్టిన సాక్షి.. కిర్జిస్తాన్ రెజ్లర్ ఐసులు టినీబెకోవాతో హోరాహోరీగా పోరాడింది. ఓ దశలో 0-5తో వెనుకబడినా.. పోరాటస్ఫూర్తిని విడనాడని సాక్షి.. చివరకు మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు మంగోలియా రెజ్లర్ ఒర్ఖాన్ పురెవ్డోర్జ్ను 12-3 తేడాతో చిత్తుగా ఓడించిన సాక్షి పతకంపై ఆశలు రేపింది. అర్ధరాత్రి మేల్కొని మరీ తన మ్యాచ్‌ను చూసిన అభిమానుల్ని ఆమె నిరాశ పరచలేదు. అంతకుముందు ‘రెప్‌చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత కొబ్లోవా ఫైనల్ కు వెళ్లడంతో సాక్షికి కాంస్య పతకం కోసం తలపడే అవకాశం దక్కింది. అసలు ‘రెప్‌చేజ్’ ఏమిటంటే... రెజ్లింగ్ ‘డ్రా’లో రెండు పార్శ్వాల నుంచి ఇద్దరు ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఫైనల్‌కు చేరిన వారిద్దరి చేతుల్లో ఎవరైతే ఓడిపోయారో వారందరికీ ‘రెప్‌చేజ్’ ద్వారా మరో అవకాశం కల్పిస్తారు. గతంలో సుశీల్‌కుమార్, యోగేశ్వర్ దత్ విషయంలో ఇలాగే జరిగింది. వారిద్దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంస్యాన్ని ఒడిసిపట్టారు. ముచ్చటగా మూడోసారి సాక్షి కూడా పతకం అందుకుంది.