ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ
30 మందికి స్థానచలనం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో భారీఎత్తున పోలీసు ఉన్నతాధికారుల బదిలీలకు తెరలేపారు. అధికారపార్టీకి మింగుడుపడని అధికారుల్ని బదిలీచేసి.. ఆ స్థానంలో అస్మదీయుల్ని నియమించడంలో భాగంగా భారీ కసరత్తు చేశారు. ఆ క్రమంలో తొలివిడతగా 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్‌కు స్థానభ్రంశం కల్పించిన ప్రభుత్వం ఆయన్ను అప్రధాన పోస్టుకు బదిలీ చేసిం ది. ఆరుగురు డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. మరో నలుగురు ఎస్పీ స్థాయి అధికారులకు డీఐజీలుగా పదోన్నతి ఇచ్చింది.
వీరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు...: రాజమం డ్రి పుష్కరాల్లో సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల తొక్కిసలాటలో 27 మంది మరణించారు. ఇందుకు రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను బాధ్యునిగా చేసి.. చేతులు దులుపుకునేందుకు అప్పట్లో చంద్రబాబు యత్నిం చారు. దీనిపై విమర్శలు రావడంతో హరికృష్ణను రాజమండ్రి అర్బన్ ఎస్పీగా కొనసాగిం చారు. తాజాగా ఆయనపై బదిలీ వేటు పడిం ది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.
వైఎస్సార్ జిల్లాలో ఎస్పీ నవీన్ గులాటి ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ దన్నుతో చెలరేగిపోతున్న టీడీపీ మద్దతుదారులైన స్మగ్లర్లకు ఆయన తీరు మింగుడుపడలేదు. ఆయన్ను బదిలీ చేయాలం టూ జిల్లా అధికారపార్టీ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడికి సర్కారు తలొగ్గింది. ఆయనపై బదిలీ వేటేసిన సర్కారు.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు తిరుపతి అర్బన్, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఎస్పీలు గోపీనాథ్ జెట్టీ, గ్రేవల్ నవదీప్ సింగ్, కోయ ప్రవీణ్లపైనా బదిలీ వేటేసిన ప్రభుత్వం వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించడం గమనార్హం. మలివిడతలో ఏడు జిల్లా ల ఎస్పీలతోసహా పలువురు ఉన్నతాధికారులకు స్థానచలనం కలగనుందని సమాచారం.