మోస్ట్ వాంటెడ్ ఎర్రస్మగ్లర్ అరెస్ట్
జిల్లాలో ఇప్పటికే 23 కేసుల్లో నిందితుడు
మరో నలుగురితో పాటు దుంగలు, వాహనాలు స్వాధీనం
రేణిగుంట: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే 23 కేసుల్లో నిందితుడిగా ఉన్న చెన్నైకు చెందిన బడా స్మగ్లర్ సోమురవి (39)ని రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి ఆయిల్ ట్యాంకరు, ఓ కారు, బైక్‌లతో పాటు రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట అర్బన్ సీఐ కార్యాలయంలో డీఎస్పీ నంజుండప్ప , అర్బన్ సీఐ బాలయ్య విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు పరిచారు. అర్బన్ సీఐ బాలయ్య మాట్లాడుతూ మండలంలోని ఆంజనేయపురం వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించామన్నారు.హుందాయ్ కారులో ఐదు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి సమాచారంతో తుంబూరు తీర్థం క్రాస్ రోడ్డుకు ఉత్తరంగా అటవీ ప్రాంతంలో 9మంది ఒక ఆయిల్ ట్యాంకరుతో ఎర్ర చందనం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉండగా వారిని పట్టుకోడానికి ప్రయత్నం చేశామన్నారు. వారు పోలీసులపై గొడ్డళ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. చాకచక్యంగా ముగ్గురిని అదుపులోకి తీసుకోగా ఆరుగురు పరారీ అయినట్లు చెప్పారు. అయిదుగురిలో కన్నయ్య(34),విజయకుమార్(33), సోము రవి(39),గణేష్(24), బాలసుబ్రమణ్యం(33)ను అరెస్టు చేశామన్నారు. వీరిలో సోమురవి పదేళ్లుగా జిల్లాలో 2012 -2014 మధ్య భాకరాపేట, వాయల్పాడు, చిత్తూరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి,నగరి, నిండ్ర, జీడీ నెల్లూరు, రొంపిచర్ల ప్రాంతాల్లో అనుచరులతో కలిసి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు. సోమురవి 23 కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నాడని చెప్పారు.
ఇతనిపై పీడీ యాక్టు పెట్టేందుకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు రమేష్, చాకలి నాదముని, చెన్నైకి చెందిన వెంకటేష్, బాల, రామనాథన్, భాస్కరన్‌ను త్వరలో అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో ఎస్ఐ మధుసూదన్,రైటర్ ముద్దుయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.