breaking news
Rail Bhawan
-
4 వేలు దాటిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కాఠిన్యం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది. వరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. ఒక్కరోజు వ్యవధిలోనే 6,977 కేసులు బయటపడ్డాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత 24 గంటల్లో 154 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 1,38,845కు, మరణాలు 4,021కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 77,103. కరోనా బారినపడిన వారిలో 57,720 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 41.57 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. కరోనా దెబ్బతో మహారాష్ట్ర వణికిపోతోంది. ఇప్పటిదాకా ఈ మహమ్మారి వల్ల దేశంలో 4,021 మంది మరణించగా, ఇందులో 1,635 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. రైల్ భవన్లో మరో ఉద్యోగికి కరోనా రైల్వేశాఖ ప్రధాన కార్యాలయం రైల్ భవన్లో పని చేస్తున్న ఓ ఉద్యోగికి తాజాగా కరోనా సోకింది. ఇదే భవనంలో కేవలం రెండు వారాల లోపే ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. మే 19వ తేదీ దాకా విధులకు హాజరైన నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా సోకినట్లు సోమవారం వెల్లడైంది. అతడితో కాంటాక్టు అయిన తొమ్మిది మందిని అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు. ఒక అధికారి నుంచి మరో అధికారి వద్దకు ఫైళ్లను తీసుకెళ్లడమే ఈ నాలుగో తరగతి ఉద్యోగి పని. ఈ ఫైళ్లు రైల్వే బోర్డు చైర్మన్‌తోపాటు రైల్వేశాఖ మంత్రిదాకా వెళ్తుంటాయి. దీంతో అతడిద్వారా ఇంకెవరికైనా కరోనా సోకిందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా కరోనా కేసులు బయటపడుతుండడంతో పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయడానికి రైల్ భవన్‌ను మే 14, 15వ తేదీల్లో మూసివేశారు. ఇప్పుడు నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా రావడంతో రైల్ భవన్‌ను మే 26, 27 తేదీల్లో మూసివేయాలని నిర్ణయించారు. -
పోలీసుల చర్యకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఆందోళన
-
‘ఆప్’కా హంగామా!!
సాక్షి, న్యూఢిల్లీ:విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రైల్‌భవన్ ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాతో సెంట్రల్ ఢిల్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పలుమార్లు ఢిల్లీ పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరిగాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో ఆప్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఢిల్లీపోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. న్యాయం జరిగేవరకు ధర్నా కొనసాగిస్తామని కే జ్రీవాల్ చేసిన ప్రకటనకు మద్దతుగా అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. అయితే నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగుతామని ముందస్తుగా ప్రకటించిన ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్కేజ్రీవాల్ ఆయన మంత్రివర్గ సహచరులు కార్లలో బయలుదేరి వచ్చారు. కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న వ్యాగనార్ కారును ఢిల్లీ పోలీసులు రైల్‌భవన్ వద్ద అడ్డుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ కారణంగా నిషేదాజ్ఞలు విధించినట్లు పోలీసులు తెలపడంతో రిహార్సల్స్ ముగిసేంతవరకు కేజ్రీవాల్ రైల్‌భవన్ వద్ద తన కారులోనే కూర్చుండిపోయారు. తరువాత కూడా తన కారును ముందుకు పోనివ్వకపోవడంతో మంత్రులతో కలిసి రైల్‌భవన్ వద్దనున్న చిన్న పార్కులో ధ ర్నాకు దిగి ప్రసంగించడం ఆరంభించారు. తాము ఢిల్లీ మహిళల భద్రత కోసం, డబ్బుల కోసం పోలీసుల పీడింపులను ఎదుర్కొనే హాకర్ల కోసం, ఆటోవాలాల కోసం, వారికి న్యాయం చేయడం కోసం తాము ధర్నా చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎస్హెచ్ఓ స్థాయి అధికారులు ఢిల్లీవాసులపై గుండాయిజం చేసి వసూలు చేసిన డబ్బును ఢిల్లీ పోలీసుకమిషనర్‌కు, హోంమంత్రి షిండేకి పంపుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ వాసులు కూడా ఈ ధర్నాలో అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొదట పలుచగా ఉన్న ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్ పిలుపు మేరకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. కేజ్రీవాల్ ధర్నాను నిరసిస్తూ పోలీసులకు మద్దతుగా కొందరు హిందూ సంస్థల ప్రతినిధులు కూడా రైల్ భవనానికి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. మెట్రోల మూసివేతతో ఇక్కట్లు.. ఢిల్లీ సీఎం ధర్నా కారణంగా ఆప్ కార్యకర్తలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు సెంట్రల్ సెక్రెటేరియట్, పటేల్‌చౌక్, ఉద్యోగ్‌భవన్, రేస్‌కోర్సు మెట్రోస్టేషన్లు మూసివేయించారు. దీంతో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ఆయా కార్యాలయాల్లో పనులపై వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు లక్ష ల మంది వరకు ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. దీనికితోడు కేంద్ర సచివాలయాలకు దారితీసే అన్ని మార్గాలను పోలీసులు కొద్దిసేపు మూసివేశారు. దీంతో ఉద్యోగులు కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డీఎంఆర్సీ అధికారులు మెట్రోస్టేషన్లు మూసివేశారు. మధ్యాహ్నం 2.14 గంటలకు తిరిగి తెరిచారు. అప్పటి వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. నిషేదాజ్ఞలూ బేఖాతరు.. జనవరి 26 వేడుకల ఏర్పాట్లు, కేజ్రీవాల్ ధర్నా నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సోమవారం జంతర్‌మంతర్ మినహా న్యూఢిల్లీ జిల్లా అంతటా ఐదుగురు లేదా అంతక న్నా ఎక్కువ మంది ఒకచోట గుమిగూడడంపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 కింద నిషేదాజ్ఞలు విధించారు. వాటిని భేఖాతరు చేస్తూ స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ మంత్రులే ధర్నాకు దిగడంతో పోలీసులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వందల సంఖ్యలో ఆప్ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు రైల్‌భవన్ వద్ద పోగయ్యారు.జంతర్‌మంతర్‌లో ధర్నా కొసాగించాలంటూ పదేపదే పోలీస్ ఉన్నతాధికారులు చేసిన విజ్ఞప్తులను కేజ్రీవాల్ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైల్‌భవన్ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు, మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఆప్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.