breaking news
Rahuludu
-
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
రాహులుడు బౌద్ధ సుతుడు
గౌతమ బుద్ధుడు ధర్మమార్గంలో నడిచాడు. తన కుమారుడైన రాహులుడికి ధర్మమార్గాన్ని ప్రబోధించాడు. బుద్ధుడంటే బుద్ధి కలిగిన వాడు.. బుద్ధిని ఇచ్చేవాడు. ఆయన తన వారసుడైన రాహులుడికి ధర్మాన్నే ఆస్తిగా పంచి ఇచ్చాడు. మనందరం బుద్ధుని బిడ్డలమే! ఆ ఆస్తికి మనం కూడా అర్హులమే! బుద్ధపూర్ణిమ సందర్భంగా ఆయన తన కుమారుడికి బోధించిన మార్గంలో నడుద్దాం.. బుద్ధిమంతులుగా ఉందాం... ఆకాశం పండువెన్నెల్ని కుమ్మరిస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ల యువరాజు సిద్ధార్థుడు మెల్లగా మేడమెట్లు ఎక్కి ఒక గది ముందు ఆగాడు. గడియ తీసి తలుపు మెల్లగా తోసి గదిలోని మంచం దగ్గరకు వెళ్లాడు. సిద్ధార్థుని భార్య యశోధర నిద్రలో కూడా ఆనందపడు తున్నట్టుగా పడుకుని ఉంది. ఆమె ఎడమ చేతి పొత్తిలిలో వెన్నెల చిరునవ్వులాంటి పసికందు తల్లి చేతిని తలగడగా చేసుకుని నవ్వుకుంటున్నాడు. అతడే రాహులుడు. దోమతెరను మెల్లగా పక్కకు తీసిన సిద్ధార్థుడు వారిద్దరి మోములు తేరిపార చూశాడు. ప్రేమించి, స్వయంవరంలో తనకు జీవితభాగస్వామిగా మారిన అందమైన ఇల్లాలు... వివాహమైన పన్నెండేళ్లకు లేకలేక కలిగిన సంతానం... అనంత ఐశ్వర్యం... అఖండ సామ్రాజ్య వారసత్వం... ముఖ్యంగా కొడుకు. తన వైజ్ఞానిక తృష్ణ తీర్చుకోవడానికీ, ఈ ప్రపంచ ప్రజలందరి దుఃఖం దూరం చేయడానికి సాగే తన ప్రయాణానికి ఆఖరి అడ్డంకి అతడు. అందుకే బిడ్డ పుట్టాడని తెలియగానే ‘నాకు రాహులుడు (అడ్డంకి) కలిగాడు’ అన్నాడు. చివరికి అదే బిడ్డకు నామమైపోయింది. చివరిసారి బిడ్డను ముద్దాడాలని, ప్రియురాలి నుదుటిని చుంబించాలని వంగాడు. అలా చేస్తే... వారు లేస్తే.. తనకు మరలా అడ్డంకి అవుతారనుకొని దయాదృక్కులతో చూస్తూ మెల్లగా లేచి.. గది దాటి... మెట్లు దిగి.. పెరటిలోకి వెళ్లాడు. ఆ రోజు చంద్రగ్రహణం. అప్పటికి సంపూర్ణ గ్రహణం పట్టింది. చీకటి ఆవహించింది. ఆ చీకటిలో కలిసిపోయి కపిలవస్తు నగరాన్ని దాటిపోయాడు. ఆ కటిక చీకట్లను పారద్రోలి కాంతి రేఖల్ని కనుగొనడానికి. ఆయనే మీ నాన్నగారు... అలా వెళ్లిన సిద్ధార్థుడు ఆరేళ్లు ధ్యానం చేశాడు. బోధివృక్షం కింద జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు. ఆనాటి మగధ దేశానికి రాజధాని అయిన ‘రాజగృహ’లో ఉంటున్నాడు. ఒకరోజు తన తండ్రి శుద్ధోధనుడి నుండి కబురు వచ్చింది ఆ బోధలు తమ నగరంలో చేయమంటూ. దాంతో ఏడేళ్ల తర్వాత తిరిగి కపిలవస్తు చేరాడు. ముందు బుద్ధుడు. చేతిలో భిక్షాపాత్ర. ఆ వెనక వందలాది మంది భిక్షువులు- ఆ దృశ్యం మేడ మీద నుంచి చూసింది యశోధర. మహారాజులా సైన్యం వెంటరాగా రథం మీద తిరగాల్సిన భర్త ఇలా భిక్షువులా యాచిస్తూ రావడం చూసి ఆమె హృదయం బరువెక్కింది.‘అమ్మా! ఆయన ఎవరమ్మా’ రాహులుని ప్రశ్న. యశోధర గుండె మరింత బరువెక్కింది. ‘చెప్పమ్మా! ఎవరమ్మా!?’ ‘నాయనా. సూర్యబింబంలా ప్రకాశించే మోము, తామరల కన్నా మెత్తనైన ఆ హస్తాలు, నీలి రత్నాల్లాంటి ఆ నేత్రాలు, ఇంద్రధనువులా వంగిన ఆ కనుబొమలు, మత్తగజంలాంటి ఆ నడక, పున్నమి చంద్రునిలాంటి వెన్నెల రూపు, సాగర గంభీరుడు, శాక్యకుమారుడు, సుమ సుకుమారుడు, దేవమానవ పూజనీయుడు వారే.. వారే నాన్నా మీ నాన్నగారు’... ఆ బిడ్డ ఆలోచనలో పడ్డాడు. ఇంతకాలం తాతగారి పెంపకంలో ఉన్నాడు. ఆయన్నే ‘నాన్నా!’ అంటూ పిలుస్తున్నాడు. ఇప్పుడు ‘వీరా నా నాన్నగారు’ అనుకొన్నాడు. ‘నాన్నగారూ’ అంటూ కేకవేశాడు. కేక వీధిదాకా చేరలేదు. వెంటనే బిడ్డను దగ్గరకు తీసుకుంది యశోధర. తండ్రి సామ్రాజ్య వారసత్వంబుద్ధుడు కపిలవస్తుకు వచ్చిన ఏడోరోజు తన భిక్షుగణంతో ఊరి చివరన ఉన్న ఆరామం కేసిపోతున్నాడు. ‘నాన్నగారూ! ఆగండి’ అంటూ ఏడేళ్ల రాహులుడు వెంటపడ్డాడు. యశోధర తన బిడ్డను అలా వెళ్లమని చెప్పింది. ‘నాయనా! మీ నాన్నగారి దగ్గరకు వెళ్లు. వారి దగ్గర నుండి నీకు రావాల్సిన వారసత్వాన్ని అందుకో. నీ వాటా నీకు ఇమ్మని కోరు. వెళ్లిరా’అని చెప్పి పంపింది. అందుకే రాహులుడు బుద్ధుని వెనకాల పడ్డాడు. ఎండ తీవ్రంగా ఉంది. బుద్ధుని నీడ ఒక పక్కగా నేలమీద పడుతోంది. ఆ నీడలోకి వచ్చి- ‘ఆగండి! మీ నీడ నాకు ఎంతో హాయిగా ఉంది. సుఖాన్నిస్తోంది’ అన్నాడు రాహులుడు. ‘నాయనా ఎవరు?’ అడిగాడు బుద్ధుడు. ‘నేను మీ కుమారుణ్ణి. రాహులుణ్ణి. మీ దగ్గర నుండి నాకు రావాల్సిన వారసత్వాన్ని తెచ్చుకోమంది అమ్మ’ ‘అలాగా! నాయనా!’ అంటూ ఆ పక్కన ఉన్న ధర్మసేనాపతి సారిపుత్రుణ్ణి పిలిచి ‘సారిపుత్రా! రాహులునికి భిక్షు దీక్ష ఇవ్వు’అని చెప్పి- ‘రాహులా! నాది ధర్మసామ్రాజ్యం. ఇదే నా ఆస్తి’ అంటూ కొడుకు చేతులకు భిక్షాపాత్ర అందించాడు బుద్ధుడు. అలా తన ఏడోఏటనే రాహులుడు బాలభిక్షువుగా మారాడు. బౌద్ధ చరిత్రలో తొలి బాల భిక్షువు రాహులుడు. బాలభిక్షువుల్ని శ్రామణేరులు అంటారు. ఆ విషయం తెలిసి శుద్ధోధనుడు తల్లడిల్లాడు. దుఃఖాన్ని ఆపుకోలేక ‘ఇక నాకెందుకు రాజ్యం. నన్నూ నీ బౌద్ధ సంఘంలో చేర్చుకో’ అన్నాడు. చివరికి బుద్ధుని తల్లి గౌతమి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోధర కూడా భిక్షు సంఘంలో చేరారు. అలా తన యావత్ వంశాన్ని ధర్మం బాటలోనే నడిచేట్టు చేశాడు బుద్ధుడు. యువభిక్షువు రాహులుడికి పద్ధెనిమిదేళ్లు వచ్చే వరకూ ఇద్దరు గురువుల దగ్గరే పెరిగాడు. సారిపుత్రుడు ధర్మంలో శిక్షణ ఇస్తే, మహా మౌద్గల్యాయనుడు నడవడికలో శిక్షణ ఇచ్చారు. ‘నా తండ్రి బుద్ధుడు’ అని ఎప్పుడూ గర్వపడేవాడు కాదు. అవినయంగా ప్రవర్తించేవాడూ కాదు. ఒక్కోసారి కటికనేల మీద, మరుగుదొడ్ల పక్కన కూడా నిద్రించేవాడు. తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. బౌద్ధ ధర్మంలో ఎంతో నిష్ణాతుడయ్యాడు. బుద్ధుడు అతనికిచ్చిన ప్రత్యేక ప్రబోధాలు బౌద్ధ సారస్వతంలో ‘రాహులో వాద సుత్త’గా ప్రసిద్ధి. ధర్మమార్గంలో ‘రాహులా! ఇటురా’అని ఒక అద్దం ముందుకు తీసుకుపోయి ‘అద్దంలోకి చూడు ఎవరున్నారో’ అని అడిగాడు బుద్ధుడు.‘భగవాన్! నా ప్రతిబింబమే ఉంది’ ‘మనం మన ముఖం మీద ఉన్న మరకల్ని చెరుపుకోవడానికి, లోపాల్ని సరిచేసుకోవడానికి అద్దం ఎలా ఉపయోగపడుతుందో మన ప్రవర్తనా దోషాల్ని సరిచేసుకోవడానికి మన మనస్సు, ఆలోచన అలా ఉపయోగపడాలి’ అని చెప్పాడు బుద్ధుడు. ‘రాహులా! నీవు చేసే పని గురించి ముందే ఆలోచించు. మంచిది కాదనిపించితే చేయకు. లేదా చేస్తున్నప్పుడైనా ఆలోచించు. మంచిది కాకుంటే అప్పుడైనా విరమించు. అప్పుడు కుదరకపోతే చేసిన తరువాత వచ్చిన ఫలితాన్ని బట్టైనా ఆలోచించు. అప్పటికైనా ఆ చెడు పనుల్ని విరమించు. ఇలా ప్రతిదశలో నీవు చేసే పనుల గురించి నీకు నీవే సమీక్షించుకో. ఎప్పుడూ తప్పులు చేయవు’ అని కూడా చెప్పాడు. అలా.. బుద్ధుని ధర్మమార్గంలో ఉంటూ అర్హంతుడు అంటే పరిపూర్ణమైన భిక్షువు కాగలిగాడు రాహులుడు. ఆయన ఎక్కువకాలం రాజగృహం దగ్గరి ఆమ్రరత్న వనంలో జీవించాడు. రాహులుడు ఎప్పుడు మరణించాడో తెలియదు. కానీ, చాలా తక్కువ వయసులో యువకునిగా ఉన్నప్పుడే మరణించాడు. తండ్రి అడుగుజాడల్లో నడిచి తండ్రి ధర్మాన్ని నడిపించిన ధర్మయువ రథసారథి రాహుల థేరుడు. - డా. బొర్రా గోవర్ధన్